
- చావును రాజకీయం చేస్తున్న కేటీఆర్, ఆర్ఎస్పీ
- హతుడు శ్రీధర్ రెడ్డికి అనేక వివాదాల్లో ప్రమేయం
- బాకా పత్రికను అడ్డం పెట్టుకొని బద్నాం చేస్తరా?
- ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి హత్య వెనుక తాను ఉన్నానంటూ మాజీమంత్రి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. శ్రీధర్ రెడ్డికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని, ఎవరో ప్రత్యర్థులు హతమార్చి ఉండొచ్చిన అన్నారు. దీనిపై ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణైనా చేయించుకోవచ్చని చెప్పారు. ఆయనపై ఉన్న కేసులకు సంబంధించిన కాపీలన్నీ కేటీఆర్ కు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పంపుతానని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తనను బద్నాం చేస్తే ఊరుకునేది లేదన్నారు.
బేవకూఫ్ గాళ్లు.. బేవకూఫ్ మాటలు మాట్లాడితే సహించనని చెప్పారు. అవసరమైతే పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేసిన కేటీఆర్, ఆర్ఎస్పీ బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. బాకా పత్రికను అడ్డం పెట్టుకొని బద్నాం చేస్తామంటే సహించబోమని అన్నారు. ‘శ్రీధర్ రెడ్డి ఎలాంటోడో ఊరికి వెళ్లి అడగండి.. వాళ్ల కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయి.. దురలవాట్లు ఉన్నాయి. ఆ పంచాయతీకి నాకేం సంబంధం’ అని జూపల్లి ప్రశ్నించారు.
‘ఒకాయన మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరొకరు ఐపీఎస్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు.. వీళ్లిద్దరూ కలిసి నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారు’ అని అన్నారు. దోషులు ఎంతటి వారైనా శిక్షించాల్సిందేనని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. మీడియా సమావేశంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.