- గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పు రూ.8.21 లక్షల కోట్లు: మంత్రి జూపల్లి
- ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన లెక్కలనే చెప్తున్నా
- ఇన్ని అప్పులు చేయలేదని కేసీఆర్‌తో చెప్పిస్తే.. రాజీనామాకు సిద్ధం
- గన్‌పార్కు వద్ద చర్చకు వస్తే బీఆర్‌ఎస్ నేతలెవరూ రాలేదని విమర్శ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అప్పులపై నేను ఇంతకు ముందు చేసిన ప్రకట నకే కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడడం కాదు.. స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన గన్‌పార్కు వద్ద మీడియాతో మాట్లాడారు. తాను చెప్పిన లెక్కలు తప్పని, కేసీఆర్‌తో చెప్పించాలని, అవి తప్పని తేలితే రాజీనామకు సిద్ధమనే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. గాంధీ భవన్ వెళ్తున్న సమయంలో గన్‌పార్కు వద్దకు హరీశ్ వస్తున్నట్లు సమాచారం రావడంతో, తాను నేరుగా ఇక్కడికే వచ్చానని జూపల్లి స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ నుంచి ఇక్కడకు ఎవరు వచ్చినా చర్చిద్దామని అనుకున్నా.. కానీ ఎవరు రాలేదని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పు రూ. 8.21 లక్షల కోట్లు అని, అయితే ఇన్ని అప్పులు చేయలేదని కేసీఆరే స్వయంగా చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన లెక్కలనే తాను చెప్తున్నానని మంత్రి అన్నారు. వాస్తవం ఇలా ఉంటే, కేటీఆర్ మాత్రం తాము చేసిన అప్పులు కేవలం రూ.3 లక్షల 50 వేల కోట్లు మాత్రమే అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసిన ఈ అప్పులకు లక్షా 80 వేల కోట్లు వడ్డీనే కడుతున్నామని చెప్పారు.
భారీగా అప్పులు.. పెండింగ్ బిల్లులు
2014 జూన్ 2న రాష్ట్ర ఏర్పాటు సమయంలో మొత్తం అప్పులు రూ. 90,161 కోట్లు మాత్రమేని, అయితే 2023 డిసెంబర్ 1 నాటికి అవి రూ.8,21,651 కోట్లకు పెరిగాయన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎఫ్‌ఆర్ఎంబీ రుణాలు రూ.72,658 కోట్లు ఉండగా, 2023 డిసెంబర్ నాటికి రూ.3,89,673 కోట్లకు చేరాయని వివరించారు. ప్రభుత్వ హామీతో ప్రత్యేక ప్రయోజన సంస్థలు (ఎస్పీవీఎస్) తీసుకున్న వాటికి ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు రూ.11,609 కోట్ల నుంచి రూ.1,27,208 కోట్లకు పెరిగాయని, ఈ రెండు కలిపి ప్రభుత్వ ప్రత్యక్ష బాధ్యతగా ఉన్న అప్పులు రూ.84,268 కోట్ల నుంచి రూ.5,16,881 కోట్లకు చేరాయని మంత్రి వివరించారు. ప్రభుత్వ హామీతో ఎస్పీవీఎస్‌లు తీసుకొని వాటిని చెల్లించే రుణాలు రూ.5,893 కోట్ల నుంచి రూ.95,462 కోట్లకు పెరిగాయని చెప్పారు.
కార్పొరేషన్లు తీసుకున్న ప్రభుత్వేతర హామీ రుణాలు రూ.59,414 కోట్లు అని, దీంతో రాష్ట్ర మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లకు చేరాయని చెప్పారు. పెండింగ్ బిల్లులు రూ.40,154 కోట్లు, డిస్కంల, సింగరేణి విద్యుత్తు బకాయిలతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బకాయిలు, ఇతర పెండింగ్ చెల్లింపులు రూ.1,09,740 కోట్లు అని జూపల్లి వివరించారు. ఇలా మొత్తంగా అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి రాష్ట్రంపై రూ.8,21,651 కోట్ల అప్పులను రాష్ట్రానికి మిగిల్చారని మంత్రి చెప్పారు. మీ హయాంలో చేసిన అప్పులకు ఇప్పుడు నెలకు రూ.6వేల కోట్ల మిత్తి కడుతున్నామని అన్నారు.
