- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు రావాలని ఇన్విటేషన్
- బెంగాల్ సీఎం మమతకు ఇన్విటేషన్ పంపిన మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణ రైజింగ్-2047’ గ్లోబల్ సమిట్‌కు రావాలని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. శుక్ర వారం స్వయంగా గువహటి వెళ్లి అస్సాం సీఎంను కలిసి ఇన్విటేషన్ కార్డు అందజేశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న సమిట్‌కు హాజరై, తెలంగాణ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని జూపల్లి విజ్ఞప్తి చేశారు.
సమిట్‌లో ఆవిష్కరించనున్న ‘విజన్-2047’ డాక్యుమెంట్ విశేషాలను కూడా హిమంతకు వివరించారు. అలాగే.. గ్లోబల్ సమిట్‌లో పాల్గొనాల్సిందిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మంత్రి సీతక్క అధికారిక ఆహ్వానం పంపారు.
ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న మమతను వ్యక్తిగతంగా కలవడం సాధ్యం కాక పోవడంతో.. సీతక్క తన అధికారిక లెటర్‌హెడ్‌పై రాసిన ఆహ్వానపత్రం, సమిట్ ఆహ్వాన కార్డును బెంగాల్ సీఎం కార్యాలయం అధికారిక ఈ-–మెయిల్‌కు పంపారు. ఆహ్వానం అందినట్లు ధ్రువీక రిస్తూ బెంగాల్ సీఎంవో ధన్యవాదాలు తెలిపింది.
ఈ ఆహ్వానాన్ని మమతా బెనర్జీకి వ్యక్తిగతంగా అందజేస్తామని సీఎంవో పేర్కొంది. అలాగే.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖును కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్వయంగా ఆహ్వానించారు. సమిట్ కు అటెండ్ కావాలని కోరారు. తప్పకుండా హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.
