అబిడ్స్, వెలుగు: హైకోర్టు దివంగత జడ్జి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, న్యాయ సూత్రాల పట్ల ఎంతో నిబద్ధతతో ఉండేవారని హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ కొనియాడారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అడ్వకేట్స్ ఆధ్వర్యంలో బుధవారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మొదటి వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివాహం తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టి, జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి స్థాయికి ఎదిగిన ఆమె ప్రస్థానం మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె మరణం తెలంగాణ న్యాయవ్యవస్థకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.సుమన్, ఉపాధ్యక్షుడు ఏ.శ్రీనివాస్, కార్యదర్శి ఏ.యుగేందర్, పలువురు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
