- రెండోసారి ఆయనకే ఛాన్స్ ఇచ్చిన సర్కార్
- 11 మందితో టీఏఎఫ్ఆర్సీ కొత్త కమిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ఏర్పాటు చేసిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మన్ గా మరోసారి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గోపాల్ రెడ్డికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెండోసారి ఆయన్నే కంటిన్యూ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. చైర్మన్ సహా మొత్తం 11మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
మెంబర్ సెక్రటరీగా విద్యాశాఖ సెక్రటరీ/ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కొనసాగనుండగా, సభ్యులుగా టీజీసీహెచ్ఈ చైర్మన్, జేఎన్టీయూ/ఓయూ/హెల్త్ వర్సిటీ వీసీలు, ఫైనాన్స్ శాఖ జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన ఆఫీసర్, ఏఐసీటీఈ/ఎంసీఐ ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు.
వారితో పాటు అకడమిక్ ఎక్స్‌పర్ట్‌లుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి సిద్దిపేట మెడికల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ విమల థామస్ సభ్యులుగా ఉంటారు. ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్‌గా చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్. నవీన్ రెడ్డి, లీగల్ ఎక్స్‌పర్ట్‌గా హైకోర్టు అడ్వకేట్ జి. జయారెడ్డిని నియమించారు.
