నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి ..టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి ..టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రభుత్వం నేరెళ్ల బాధితులకు న్యాయం చేయకపోతే హైదరాబాద్ వేదికగా ధర్నా చేస్తానని టీఆర్పీ అధినేత తీన్మార్​ మల్లన్న హెచ్చరించారు. బుధవారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇల్లంతకుంట మండలం రామోజిపేటలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పెద్దలింగాపూర్ రైతులు చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.

అనంతరం తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల బాధితులను కలిశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, నేరెళ్ల బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించిన అధికారులకు ప్రమోషన్లు లభించాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉంటామని చెప్పిన వారు అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శించారు.  కాళేశ్వరం 11వ ప్యాకేజీ పనుల జాప్యంపై కేటీఆర్​, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎందుకు స్పందించడం లేదని మల్లన్న ప్రశ్నించారు. ఎల్‌‌ఎం- 6 కాలువ పనులు పూర్తైతే ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో సుమారు పది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతులు నెల రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.