ఉప్పుడు బియ్యం ఒక్కసారిగా నిలిపేయడం సాధ్యం కాదు

ఉప్పుడు బియ్యం ఒక్కసారిగా నిలిపేయడం సాధ్యం కాదు

వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇస్తూ ప్రకటన చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏ సీజన్ లో ఎంత కొనుగోలు చేస్తారో కూడా స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. గత రెండు రోజుల నుంచి పార్లమెంటులో తెలంగాణ రైతుల కోసం టీఆర్ఎస్ నాయకులమంతా గళమెత్తామని ఆయన అన్నారు. ‘ఖరీఫ్, రబీలో బియ్యం సేకరణలో భాగంగా ఉప్పుడు బియ్యం కొనుగోలుపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉత్పత్తి అవుతున్న ఉప్పుడు బియ్యం ఒక్కసారిగా నిలిపి వేయడం సాధ్యం కాదు. దీనికోసం మరికొంత సమయం కావాలి. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న వరిధాన్యంపై స్ఫష్టత కోసం పీయూష్ గోయల్ రాష్ట్రంలో పర్యటించాలి. వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇస్తూ ప్రకటన చేయాలి.  ఏ సీజన్ లో ఎంత కొనుగోలు చేస్తారో స్పష్టత ఇవ్వాలి’ అని కేశవరావు అన్నారు.

కేంద్ర మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటన చేయడం మానుకోవాలి

రైతులతో కేంద్రం రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ లోక్ సభపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. గత 60 రోజుల నుంచి ఆరుసార్లు సమావేశాలు నిర్వహించినా కేంద్రం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదన్న ఆయన.. పైగా బీజేపీ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ముందు ధర్నా కోసం టీఆర్ఎస్ ఎంపీలతో కలసిరావాలి. వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రితో పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేయాలి. కేంద్ర మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటన చేయడం మానుకోవాలి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ ఎంపీలు తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రితో ప్రకటన చేయించాలి. తెలంగాణ రైతాంగం మీద చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సాక్షిగా కిషన్ రెడ్డి ప్రకటన చేయించాలి. రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల లెక్కలు లేవని కేంద్రం తప్పించుకోవడం భాధాకరం. తక్షణమే రూ. 25 లక్షల నష్టపరిహారం ప్రకటించాలి. గత సంవత్సరం 94 లక్షల 53 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న కేంద్రం.. ఈ సంవత్సరం మేం కోరిన విధంగా కనీసం 1 కోటి టన్నుల వరిధాన్యం సేకరణ చేయాలి. తెలంగాణ రైతాంగాన్ని కించపరిచేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతున్నాడు’ అని నామా నాగేశ్వరరావు అన్నారు.