‘వాంటెడ్ పండుగాడ్’తో ఎంజాయ్ చేస్తారు

‘వాంటెడ్ పండుగాడ్’తో ఎంజాయ్ చేస్తారు

ఆగస్టు 19న రిలీజ్ అవుతోన్న ఎంటర్‌టైనింగ్ మూవీ ‘వాంటెడ్ పండుగాడ్’ ఎంజాయ్ చేస్తారని శ‌తాధిక చిత్ర ద‌ర్శకుడు, ద‌ర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు అన్నారు. ఆయన స‌మ‌ర్పణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ బిగ్ టికెట్ లాంఛ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దేశమంతా ఆనందంగా ఉంది. సినిమాల‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చింది. సీతారామం, బింబిసార‌, కార్తికేయ 2 వంటి సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో థియేట‌ర్స్‌లో మా సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’ రిలీజ్ అవుతుంది. నా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ పి.ఆర్, డైరెక్టర్ శ్రీధర్ సీపాన సహా ప్రతి ఒక టెక్నీషియన్ ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఆర్టిస్టులు ఎంతగానో కో ఆపరేట్ చేశారు’’ అన్నారు.

సునీల్ మాట్లాడుతూ.. ‘‘రాఘవేంద్రరావు సినిమాల్లో పళ్లు ఉంటాయి. కానీ ఈ సినిమాలోనే పండుంది. సాధార‌ణంగా దేవుడు (గాడ్‌) ద‌గ్గర‌కి ప‌ళ్లు తీసుకెళ‌తాం క‌దా.. అందుకే పండు, గాడ్ అని రెండింటినీ టైటిల్‌లో పెట్టాం. ఇప్పటి సినిమాల్లో క‌మెడియ‌న్స్ న‌టిస్తున్న వారందరం ఇందులో న‌టించాం. నేను కూడా చాలా కీల‌క‌మైన పాత్రలో న‌టించాను. మాతో పాటు నా త‌మ్ముడు.. శ్రీధ‌ర్ సీపాన‌కు ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా చాలా మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత‌ల‌కు ఈ సినిమా చాలా ఎక్కువ‌గా డ‌బ్బులు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.  

అనసూయ మాట్లాడుతూ.. ‘‘ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ ‘వాంటెడ్ పండుగాడ్’ ఆగ‌స్టు 19న రిలీజ్ అవుతుంది. అంద‌రూ సినిమా చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను. రాఘ‌వేంద్రరావుకి థాంక్స్‌. టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవరైనా.. షూటింగ్‌ను మేం ఎంజాయ్ చేశాం. రేపు సినిమా చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. శ్రీధ‌ర్‌ టాలెంట్‌ను రేపు థియేట‌ర్‌లో చూస్తారు’’ అన్నారు. 

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘‘రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగిన మాకు, ఆయ‌న సినిమాల్లో న‌టించే అవ‌కాశం రావ‌టం ఎక్కడో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఆయ‌న సినిమాలో ఓ సీన్‌లో క‌నిపిస్తే చాల‌నుకున్నాం. అలాంటిది పిలిచి సినిమానే ఇచ్చాడు. ఇంత గొప్ప అవ‌కాశం ఇచ్చిన రాఘ‌వేంద్రరావుకి థాంక్స్‌. ఆగ‌స్టు 19న వస్తోన్న ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూడాలి’’ అన్నారు. 

డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్నంత మంది క‌మెడియ‌న్స్ ఇండియాలో ఎక్కడా లేరు. ఇప్పటికీ క‌మెడియ‌న్స్ సంఖ్య విష‌యంలో మ‌న ఇండ‌స్ట్రీనే టాప్‌. ఎంట‌ర్‌టైన్మెంట్‌, కామెడీని నేను ఇష్టప‌డ‌తాను. అందుక‌ని క‌మెడియ‌న్స్ నాకు ఇష్టమే కాదు.. గౌర‌వం కూడా. రాఘ‌వేంద్రరావుకి ఎంత వ‌య‌సు వ‌చ్చినా ప‌ళ్లను వ‌ద‌ల‌ర‌ని చెప్పటానికే ఈ టైటిలే నిద‌ర్శనం. ఆయ‌న‌కు పండే దేవుడు. అందుకే ‘వాంటెడ్ పండుగాడ్’ అనే టైటిల్‌ను పెట్టారు. పాండ‌మిక్ స‌మ‌యంలో రాఘ‌వేంద్రరావు రెండు సినిమాల‌ను తీసేశారు. ఆయ‌న స్పీడు చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌. సునీల్‌, సుధీర్‌, పృథ్వీ స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 

చిత్ర దర్శకుడు శ్రీధ‌ర్ సీపాన మాట్లాడుతూ ‘‘ఈ 19న హిట్ కొట్టబోతున్నాం. గుండెల‌పై చేయి వేసుకుని చెబుతున్నాను. మూడు సినిమాల‌ను డైరెక్ట్ చేస్తున్నా.. రాఘవేంద్రరావు ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా ముందు రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ పి.ఆర్‌, కెమెరామెన్ మ‌హీరెడ్డి, ఎడిట‌ర్ త‌మ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ కిర‌ణ్‌ స‌హా నా డైరెక్షన్ టీమ్ నాకు అందించిన స‌పోర్ట్ మాట‌ల్లో చెప్పలేనిది. రాఘ‌వేంద్రరావు ఋణం తీర్చుకోలేనిది’’ అన్నారు.