వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామస్థులు నిరసనకు దిగారు. ఇండస్ట్రీయల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా గురువారం (మార్చి 26) పరిగి బస్టాండ్ ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల నిరసనతో బీజాపూర్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
రంగంలోకి దిగిన పోలీసులు నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాలను మహిళా రైతులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ మద్దతు ఇచ్చాయి.
కాగా, ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం కాడ్లాపూర్, రాపోలు రెండు గ్రామాల్లో కలిసి 1197 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంట్లో 260 ఎకరాల పట్టా భూములు కాగా, 937 ఎకరాల లావణి పట్టా భూములు. దీంతో తమకు జీవనాధారమైన భూములు లాక్కొవద్దని రైతుల రోడ్డెక్కారు.
