గాంధీభవన్​లో కాకా జయంతి ఉత్సవాలు

గాంధీభవన్​లో కాకా  జయంతి ఉత్సవాలు
  • నివాళులర్పించిన ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఇతర నేతలు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ‘కాకా’ వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావుతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ‘కాకా’కు నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ప్రజల కోసం కాకా చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించు కున్నారు.

కాకా లాంటోళ్లు  మరొకరు లేరు.. 

నా వయసు కంటే కూడా కాకా అనుభవం ఎక్కువ. నేను యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వివేక్ వెంకటస్వామి నాకెంతో సపోర్ట్ చేశారు. కాకా లాంటి విజన్ ఉన్న లీడర్.. తెలంగాణలో ఎవరూ ఉండకపోవచ్చు. కాకా సబ్బండవర్గాల నాయకుడు. ఆయన ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకుపోదాం.
= అనిల్ కుమార్ యాదవ్,  ఎంపీ 

మనసున్న ప్రజా నాయకుడు

కాకా నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నేను ఎస్ఐగా డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు ఆయన అండగా నిలిచారు. ఆ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని, సేవ చేయాలని కాకా నుంచే నేర్చుకున్న. మంచి మనస్సున్న ప్రజా నాయకుడు.

– వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు-

అణగారిన వర్గాల బంధువు..  

కాకా.. అణగారిన వర్గాల ఆత్మ బంధువు. కాకా అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయన కుటుంబం కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నది. విద్యతోనే అన్ని సమస్యలకు పరిష్కారమని భావించి అంబేద్కర్ విద్యాసంస్థలను కాకా స్థాపించారు. న్యాయ వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తించి లా కాలేజీ ఏర్పాటు చేశారు. అందులో చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. 

- జస్టిస్ చంద్రయ్య, హెచ్ఆర్ సీ మాజీ చైర్మన్