మౌనిక మృతికి కారణం ఎవరు..నిర్లక్ష్యమా..బాధ్యతా రాహిత్యమా..

మౌనిక మృతికి కారణం ఎవరు..నిర్లక్ష్యమా..బాధ్యతా రాహిత్యమా..

చిన్నారి మృతికి కారణం ఎవరు...ఓ నిండు ప్రాణం పోవడానికి కారణం ఏమిటి. నిర్లక్ష్యమా...బాధ్యతా రాహిత్యమా.. ఈ రెండే ప్రధానంగా వెలుగుచూస్తున్న కారణాలు. సికింద్రాబాద్ కళాసిగూడలో చిన్నారి మౌనిక మృతిలో నిర్లక్ష్యం..బాధ్యతా రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

లోతట్టు ప్రాంతంలో చర్యలేవు..

సికింద్రాబాద్ కళాసిగూడ ప్రాంతం లోతట్టు ప్రాంతం. చిన్న వర్షానికే పరిసర ప్రాంతాల్లోని నీరంతా ఇక్కడికే ప్రవహిస్తుంటుంది. దీంతో ఇక్కడ చిన్న వర్షం పడినా కూడా రోడ్లన్నీ మునిగిపోతాయి. మరి ఏప్రిల్ 29వ తేదీన అతి భారీ వర్షం పడింది. దీంతో కళాసిగూడ నీటిమయంగా మారింది. అయితే ఈ సమయంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమవ్వాలి. స్థానిక సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టాలి. కానీ అవేమి లేవు. 
 

నగరం నడిబొడ్డున సికింద్రాబాద్ ఏరియాలో వర్షం దంచికొట్టింది. ఈ సమయంలో జీహెచ్ఎంసీ, ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు ఉండాలి. ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించాలి. కానీ అవేమి లేవు. తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురిసినా..ఒక్క అధికారి కానీ..ఒక్క సిబ్బంది కానీ రోడ్డుపైకి రాలేదు. ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట. అదే సిబ్బంది కానీ..అధికారులు కానీ చర్యలను ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తే ఈ ఘోరం జరిగేదా..అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

ఇది ఎండాకాలం...ఇవన్నీ అకాల వర్షాలు..అయినా చర్యల్లేవు. ముందస్తు జాగ్రత్తల్లేవ్. ఎండాకాలంలోనే వచ్చే అకాల వర్షాలపై ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే..ఇక వర్షాకాలంలో ఇంకెంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో. ఈ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది బలి కావాలో అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.