జూలై 27న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ .. ప్రభుత్వానికి సమర్పించనున్న కమిషన్‌‌‌‌ చైర్మన్

జూలై  27న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ .. ప్రభుత్వానికి సమర్పించనున్న కమిషన్‌‌‌‌ చైర్మన్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇచ్చేందుకు కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ రంగం సిద్ధం చేస్తున్నది. ఈ నెల 27 నాటికి రిపోర్ట్‌‌‌‌ను సమర్పించేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అధికారుల నుంచి స్టేట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ తీసుకున్న కమిషన్.. డ్రాఫ్ట్ రిపోర్ట్‌‌‌‌ను సిద్ధం చేసింది. అయితే, ప్రజా ప్రతినిధులను విచారించడంతో వారి స్టేట్‌‌‌‌మెంట్స్‌‌‌‌నూ నివేదికలో చేరుస్తున్నది. అంతేగాకుండా.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌పై గత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలపైనా స్టడీ చేస్తున్నది. అన్ని అంశాల ఆధారంగా కమిషన్ పూర్తిస్థాయి రిపోర్ట్‌‌‌‌ను సిద్ధం చేయనుంది. ప్రాజెక్టుకు గత ప్రభుత్వ కేబినెట్‌‌‌‌ ఆమోదం లేదని పేర్కొంటూ కమిషన్‌‌‌‌కు సర్కారు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఈఎన్సీ అనిల్ కుమార్‌‌‌‌‌‌‌‌కు నోటీసులు..

ప్రాజెక్టుకు సంబంధించి ఈఎన్సీ అనిల్ కుమార్‌‌‌‌‌‌‌‌కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగాక.. దాని కింద భారీ గొయ్యి పడడంతో దానికి అనిల్ కుమార్ గ్రౌటింగ్ చేయించారు. అయితే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మాత్రం జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవీ చేయకుండా గ్రౌటింగ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ఆధారాల్లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కారణంతోనే ఎన్డీఎస్ఏ తుది నివేదిక కూడా ఆలస్యమైంది. గ్రౌటింగ్ చేయడంపై అనిల్ కుమార్ రాంగ్ స్టేట్‌‌‌‌మెంట్ ఇచ్చినట్టు కమిషన్ గుర్తించింది. దీనిపై వివరణ ఇచ్చేందకు 9న కమిషన్ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది.