కాళేశ్వరం తిప్పిపోతలు

కాళేశ్వరం తిప్పిపోతలు
  • కాంగ్రెస్​ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోస్తూ రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల అప్పుల భారం వేసిందని కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మూడేండ్లలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి 120 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తే.. ఎగువ నుంచి వరద వచ్చి160 టీఎంసీలు కిందికి వదిలేశారని, ఇది ఎత్తిపోతలా.. తిప్పిపోతలా అనేది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మిషన్‌‌ భగీరథ, కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులకు అప్పులు తెచ్చి ఆ భారం ప్రజలపై మోపారన్నారు. అనేక పవర్‌‌ ప్లాంట్లు నిరుపయోగంగా ఉంటే వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా పవర్‌‌ ప్లాంట్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఏముందని
ప్రశ్నించారు. 

హాఫ్​ మైండ్ ​అంటరా?
ఆర్థిక మంత్రి తమను ‘హాఫ్‌‌ మైండ్‌‌’ అన్నారని, తమకు తెలివే లేకుంటే సోనియాగాంధీని ఒప్పించి హైదరాబాద్‌‌తో కూడిన తెలంగాణ ఇప్పించి ఉండేవాళ్లం కాదని రాజగోపాల్​రెడ్డి మండిపడ్డారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు ప్రభుత్వంలోని వాళ్లు కాంగ్రెస్‌‌పై పదే పదే విమర్శలు చేయవద్దన్నారు. మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి జోక్యం చేసుకొని హైదరాబాద్‌‌ను యూటీ చేయాలని సోనియాగాంధీ దగ్గర కాంగ్రెస్‌‌ నాయకులు ఒప్పుకొని వచ్చారన్నారు. రాజకీయం కాకుండా సబ్జెక్ట్ ​మాట్లాడాలని సూచించారు. రాజగోపాల్‌‌ రెడ్డి స్పందిస్తూ.. బడ్జెట్‌‌పై రిప్లయ్‌‌లో కాంగ్రెస్‌‌ను హాఫ్‌‌ మైండ్‌‌ అనడం సబ్జెక్టా అని ఎదురు ప్రశ్నించారు. హైదరాబాద్‌‌తో కూడిన తెలంగాణ ఉండటం మనకు అసెర్ట్ అని, మనం అప్పులు తెచ్చుకోవడం కాదని.. లిఫ్టులు, పవర్‌‌ ప్లాంట్ల పేరుతో ప్రభుత్వం డబ్బు వృథా చేయకుంటే మనమే ఇతర రాష్ట్రాలకు అప్పులు ఇవ్వగలిగేవారమని అన్నారు. హరీశ్‌‌రావు రిప్లయ్‌‌ ఇస్తూ.. హాఫ్‌‌ మైండ్‌‌ అని కాంగ్రెస్‌‌ సభ్యులను ఉద్దేశించి అనలేదన్నారు. కొందరు బయట అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వాళ్లను ఉద్దేశించి మాత్రమే అన్నానన్నారు.