భూ సర్వే చేయొద్దని..ఆఫీసర్ కాళ్లపై పడ్డ రైతు

భూ సర్వే చేయొద్దని..ఆఫీసర్ కాళ్లపై పడ్డ రైతు

పెగడపల్లి, వెలుగు: భూముల తప్పుడు వివరాలతో గెజిట్​విడుదల చేశారని, బావులను లెక్కలోకి తీసుకోకుంటే తాము నష్టపోతామని కాళేశ్వరం లింక్​2 పైప్​లైన్ ​భూ నిర్వాసితులు వాపోయారు. కాళ్లు మొక్కుతాం.. భూ సర్వే చేయకుర్రి అంటూ ఆఫీసర్ల కాళ్లపై పడ్డారు. అయినప్పటికీ ఆఫీసర్లు పోలీసు పహారా మధ్య కొలతలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్​గ్రామంలో కాళేశ్వరం లింక్​2 పైప్​లైన్​కోసం 150 ఎకరాల వరకు సేకరిస్తున్నారు. ఇందులో 30 మంది రైతుల భూముల్లో బావులు ఉన్నాయి. ఆఫీసర్లు ఆ బావులను లెక్కలోకి తీసుకోకుండా భూ సర్వే కోసం గెజిట్​విడుదల చేశారు. దీంతో గురువారం సర్వేకు వచ్చిన ఆఫీసర్లను రైతులు అడ్డుకున్నారు. బావులను గుర్తించకుండా గెజిట్ విడుదల చేసి భూనిర్వాసితుల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బావులను లెక్కలోకి తీసుకోకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ వాపోయారు. రైతుల గోడును పట్టించుకోకుండా ఆఫీసర్లు పోలీస్ పహారా మధ్య భూ సర్వే కొనసాగించారు. సర్వేను సెల్ ఫోన్ లో  చిత్రీకరిస్తుంటే పోలీసులు  ఫోన్లు లాక్కొని వీడియోలు డిలీట్ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.