సాధారణంగా ఉద్యోగులు ఒకే సంస్థలో 5 ఏళ్ల పాటు నిరంతరంగా పనిచేస్తేనే గ్రాట్యుటీకి అర్హులవుతారని మనందరికీ తెలుసు. 1972 నాటి గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం ప్రకారం.. దీర్ఘకాలం పాటు నమ్మకంగా సేవలందించిన ఉద్యోగికి యాజమాన్యం ఇచ్చే కృతజ్ఞత పూర్వక రివార్డ్ ఇది. అయితే ఈ 5 ఏళ్ల నిబంధన వెనుక చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన మినహాయింపులు, ట్విస్టులు ఉన్నాయి. అవేంటో తెలిస్తే రిటైర్మెంట్ ఫండ్, సేవింగ్స్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
ముందుగా చట్టం ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా గ్రాట్యుటీ చెల్లించాల్సిందే. ఇక్కడ నిరంతర సేవ అంటే కేవలం ఆఫీసుకి వెళ్లిన రోజులే కాదు.. పెయిడ్ లీవ్స్, ప్రసూతి సెలవులు, అనారోగ్యం వల్ల కలిగే అంతరాయాలు కూడా ఇందులో భాగమే. అయితే 5 ఏళ్లు నిండకుండానే గ్రాట్యుటీ పొందే అవకాశం ఒక సందర్భంలో మాత్రమే ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఉద్యోగి మరణించినా లేదా ప్రమాదం, అనారోగ్యం వల్ల శాశ్వత వైకల్యానికి గురైనా.. ఐదేళ్ల రూల్ తో సంబంధం లేకుండా వారి వారసులకు గ్రాట్యుటీ అందుతుంది. ఒకవేళ ఉద్యోగి ఒక ఏడాది కంటే తక్కువ కాలం పనిచేసినా సరే.. ఆ కాలానికి తగిన గ్రాట్యుటీని చెల్లించాల్సి ఉంటుంది.
ఇక్కడ మరో క్రేజీ విషయం ఏమిటంటే.. మీరు కచ్చితంగా క్యాలెండర్ ప్రకారం ఐదేళ్లు పూర్తి చేయనవసరం లేదు. న్యాయస్థానాల తీర్పుల ప్రకారం ఒక ఉద్యోగి 4 ఏళ్ల 240 రోజులు పూర్తి చేస్తే.. దానిని ఐదేళ్ల నిరంతర సేవగా పరిగణించవచ్చు. దీనిని లిబరల్ ఇంటర్‌ప్రిటేషన్ అంటారు. అంటే మీరు ఐదేళ్లు పూర్తి కావడానికి కొన్ని నెలల ముందు రాజీనామా చేయాలనుకుంటే, ఒకసారి మీ వర్కింగ్ డేస్ లెక్క చూసుకోవడం మంచిది. కొన్ని కంపెనీలు తమ పాలసీల ప్రకారం 4 ఏళ్ల 240 రోజులకే గ్రాట్యుటీ ఇచ్చేస్తాయి.
►ALSO READ | దక్షిణ కొరియాలో వింత: బౌద్ధ వేడుకలో సందడి చేసిన రోబో సన్యాసి 'గాబీ'..
ఒకవేళ మీరు అర్హులై ఉండి కూడా కంపెనీ గ్రాట్యుటీ ఇవ్వడానికి నిరాకరిస్తే.. మీరు లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం చేసినా లేదా నిలిపివేసినా కంపెనీలకు భారీ జరిమానాలు పడతాయి. అందుకే ఉద్యోగం మారేటప్పుడు లేదా కెరీర్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ రూల్స్ గుర్తుంచుకోండి. కొన్ని వారాల అదనపు పని మిమ్మల్ని భారీ మొత్తానికి అర్హులను చేస్తుంది. మీ హక్కుల గురించి అవగాహన ఉంటే, కష్టపడి సంపాదించుకున్న ప్రయోజనాన్ని కోల్పోయే అవకాశం ఉండదు. అయితే కొత్తగా దేశంలో అమలులోకి వచ్చిన లేబర్ చట్టాల ప్రకారం కాంట్రాక్ట్, టెంపరీ ఉద్యోగులు ఏడాది వర్క్ పూర్తి చేసుకున్నాక గ్రాట్యుటీ పొందటానికి అర్హత కల్పించబడింది. అయితే సాధారణ ఉద్యోగులు మాత్రం కనీసం 5 ఏళ్లు పని చేయాల్సిందే.
