దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ప్రసిద్ధ జోగ్యేసా ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. బుద్ధ పూర్ణిమ అంటే బుద్ధుని పుట్టినరోజు వేడుకల సందర్భంగా 'గాబీ' అనే మనిషిలా కనిపించే హ్యూమనాయిడ్ రోబోట్ సన్యాసి అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆలయంలో రోబో సందడి
సాధారణంగా ఆలయాల్లో సన్యాసులు చేసే ఆచారాలను ఈ రోబో చేసింది. ఈ గాబీ రోబో సుమారు 130 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. ఇంకా సన్యాసులు వేసుకునే బూడిద, గోధుమ రంగు బట్టలు ధరించింది. మెడలో 108 పూసల జపమాల వేసుకుని, అక్కడి పెద్ద సన్యాసుల పక్కనే కూర్చుగా... ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషుల్లాగే చేతులు జోడించి అందరికీ నమస్కరించింది.
ఈ వేడుకలో భాగంగా ఒక సన్యాసి ‘నువ్వు బౌద్ధమతానికి అంకితమవుతావా ?’ అని అడగ్గా, ఆ రోబో ‘అవును, అంకితమవుతాను’ అని బదులివ్వడం విశేషం.
టెక్నాలజీ - సంప్రదాయం కలిస్తే
దక్షిణ కొరియాలో ఇదే మొదటి రోబో బౌద్ధ సన్యాసి. కృత్రిమ మేధస్సు (AI) అండ్ రోబోటిక్స్ రంగంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా దేశం, ఇప్పుడు టెక్నాలజీని మతపరమైన ఆచారాల్లో కూడా ఎలా వాడవచ్చో ప్రపంచానికి చూపించింది.
దక్షిణ కొరియా ఈ ప్రయత్నం ఎందుకు చేసిందంటే ఈ రోబో నిజమైన సన్యాసి కాదు గానీ, మతపరమైన కార్యక్రమాల్లో సాంకేతికత ఎలా తోడ్పడుతుందో చూపించడానికి దీన్ని రూపొందించారు. ఈ రోబో ప్రత్యేకతలు ఏంటంటే మనుషుల్లాగే హావభావాలు పలికించడం, గౌరవంగా వంగి నమస్కరించడం వంటి పనులను ఈ రోబో చక్కగా చేస్తోంది.
సైన్స్ ఇంకా ఆధ్యాత్మికతను కలిపి దక్షిణ కొరియా చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో ఇలాంటి రోబోలు మన జీవితంలో భాగం కావడమే కాకుండా, సంప్రదాయ వేడుకల్లో కూడా కనిపిస్తాయని ఈ సంఘటన ద్వారా అర్థమవుతోంది.
