తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సిటీలో వాహనాలను నిలిపివేయడంపై ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ( మే 7 ) శంషాబాద్ నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్ లోనే పయనించారు సీఎం. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజల పనులను నిలిపివేయద్దని..ప్రజలకు రోడ్లపై ఇబ్బందులు కలిగించే చర్యలను పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్.
ఈ క్రమంలో సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించారు ట్రాఫిక్ పోలీసులు. ఇదిలా ఉండగా... బుధవారం ( మే 6 ) సీఎం ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ హుటాహుటిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా కాకుండా, సింగిల్ లైన్ గా విభజించి వాహనాలను పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో త్వరలోనే 'ట్రాఫిక్ బ్యూరో' ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు విధివిధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు.
ప్రధానంగా ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ లేకుండా చూడాలని, ఐఎస్ డబ్ల్యూ, సీఎస్ డబ్ల్యూ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతల విభాగం అధికారులు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని పోలీసు సిబ్బందిని డీజీపీ ఆదేశించారు.
