- వచ్చే రూ.125 కోట్లలో రూ.100 కోట్లు కరెంట్ బిల్లులకే
- భారం తగ్గించుకునేందుకు కొత్త ప్లాన్
- మొదటి దశలో మూడు ప్లేసుల్లో ప్లాంట్లు
- 67.5 మెగావాట్లఉత్పత్తికి రంగం సిద్ధం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సోలార్‌ఎనర్జీ ఉత్పత్తికి వాటర్‌బోర్డు సన్నాహాలు చేస్తోంది. జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రధాన జలాశయాల నుంచి పెద్దమొత్తంలో నీటిని పంపింగ్ ద్వారానే తరలిస్తోంది. దీంతో బోర్డుపై విద్యుత్ బిల్లుల భారం పెరుగుతోంది. దీంతో సొంతంగా కొంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేందుకు అధికారులు కొన్నేండ్లుగా చేస్తున్న ప్రయత్నాలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి.
ప్రస్తుతం నగరానికి ప్రధాన నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నుంచి కృష్ణా ప్రాజెక్టు మూడు దశలు, కరీం నగర్జిల్లాలోని ఎల్లంపల్లి నుంచి గోదావరి మొదటి దశ ప్రాజెక్టులతో పాటు మంజీరా నీటిని కూడా కొంత పంపింగ్ద్వారానే తరలిస్తున్నారు. ఇలా రోజు 435 ఎంజీడీలను పంపింగ్ ద్వారానే తీసుకువస్తోంది. దీంతో ప్రతి నెలా వాటర్‌బోర్డుకు దాదాపు రూ.120 కోట్ల ఆదాయం వస్తుండగా, ఇందులో రూ. 100 కోట్లు నీటి బిల్లులకు సరిపోతోంది.
ఈ నేపథ్యంలో సొంతంగా సోలార్‌పవర్‌ను ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ రెన్యువబుల్‌ఎనర్జీ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ (టీజీ రెడ్కో)తో సహకారంతో అధికారులు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే బోర్డుకు 67.5 మెగావాట్లవిద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు.
టీజీ రెడ్కో సహకారంతో..
బోర్డుకు అనేక చోట్ల ఖాళీ భూములున్నాయి. వీటిలో కొన్ని చోట్ల సోలార్ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీని కోసం అధికారులు టీజీ రెడ్కోతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. బోర్డుకు గోదావరి ప్రాజెక్టుకు చెందిన ముర్మూర్ పంప్ హౌస్ వద్ద 60 ఎకరాలు, మల్లారం పంప్ హౌస్ ఉన్న సిద్ధిపేటలోని చిన్న కోడూరు వద్ద 80 ఎకరాలు, కొండపాక సబ్‌స్టేషన్ వద్ద 100 ఎకరాలు, మెదక్ జిల్లాలోని పటాన్చెరు వద్ద ఉన్న పెద్దాపూర్ సబ్‌స్టేషన్ వద్ద 50 ఎకరాలు ఉన్నాయి.
మొదటి దశలో ఇక్కడ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్‌పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్లాన్లు రూపొందించారు. దీనికి రూ.383 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్లాంట్ల ద్వారా 67.5 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు. కాగా, బోర్డు పరిధిలోని 72 ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలు, కొన్ని చోట్ల రిజర్వాయర్లు ఉండగా, సోలార్‌ఎనర్జీ ప్లాంట్లకు ఇవి అనుకూలంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. మొదటి దశలో ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ఉత్పత్తి వల్ల బోర్డు అవసరాలు కొంత వరకయినా తీరితే మరికొన్ని చోట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే అవకాశం ఉంది.
