- పంట పొలాల నుంచి అంటుకున్న మంటలు..
- కాలిబూడిదైన కంప్యూటర్లు, ఫర్నిచర్ రూ.కోటి వరకు ఆస్తి నష్టం!
జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ ఎల్అండ్ టీ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. అంబట్ పల్లి సమీప పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఎల్అండ్ టీ సంస్థ ఆఫీస్, గెస్ట్ హౌస్ కు వ్యాపించాయి. ఈదురుగాలులు వీచడంతో ఆఫీస్ లోని అన్ని గదులకు మంటలు అంటుకున్నాయని స్థానికులు తెలిపారు.
కంప్యూటర్లు, ఇతర ఫర్నిచర్‌తోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ఫైల్స్, హార్డ్, సాఫ్ట్కాఫీలు కూడా కాలిబూడిదైనట్లు తెలుస్తోంది. మొత్తం బోర్డు, ఇతర మెటీరియల్‌తో నిర్మించిన గోడలు, వైరింగ్ కాలిపోయి షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రూ.కోటి వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందన్నారు.
కాగా, సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఇటీవలే ఎల్అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్ ఈ గెస్ట్‌హౌస్‌ను సందర్శించారు.
ప్రమాదంపై అనుమానాలు
అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా కావాలనే తగలపెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బోర్ హోల్స్ టెస్టులను స్పీడప్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ ఉన్న ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది
