కల్లూరు, వెలుగు: ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివారులో గంజాయి అమ్ముతున్న ఐదుగురిని పట్టుకొని, వారి నుంచి రూ.11.55 లక్షల విలువైన 23.100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. గురువారం రూరల్ సీఐ ముత్తు లింగయ్య, ఎస్సై డి హరితతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. కల్లూరు పట్టణంలో బుధవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, కాశ్మీర శివాలయం ఖాళీ ప్రాంగణంలో ఆటో, బైక్‌పై ఉన్న కొందరు వ్యక్తులు పోలీస్ వెహికల్‌ను చూసి పారిపోయేందుకు యత్నించారు.
వారిలో ఐదుగురిని పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన ఆటోలో తనిఖీ చేయగా 12 ప్యాకెట్లలో ఎండు గంజాయి లభ్యమైంది. పాల్వంచకు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ అన్వర్, కల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ ముజాహిద్ పాషా, పాల్వంచకు చెందిన మహమ్మద్ వజీర్ ఖాన్, హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన దేవరం రాకేశ్, సికింద్రాబాద్ కు చెందిన మహమ్మద్ ఆదిల్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీస్ ఆఫీసర్లను ఏసీపీ అభినందించారు.
