ఇంటర్న్‌‌షిప్ కోసం పైసా అడగొద్దు..అదనపు వసూళ్లపై ప్రైవేట్ కాలేజీలకు కాళోజీ హెల్త్ వర్సిటీ వార్నింగ్

ఇంటర్న్‌‌షిప్ కోసం పైసా అడగొద్దు..అదనపు వసూళ్లపై ప్రైవేట్ కాలేజీలకు కాళోజీ హెల్త్ వర్సిటీ వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వార్నింగ్ ఇచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ శనివారం అన్ని ప్రైవేట్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు కంపల్సరీ రోటరీ ఇంటర్న్‌‌షిప్ చేయాల్సి ఉంటుంది.

అయితే, చాలా కాలేజీలు ఈ ఇంటర్న్‌‌షిప్ పీరియడ్‌‌కు కూడా అదనంగా ఫీజులు కట్టాలని, లేకపోతే అనుమతించబోమని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై సీరియస్ అయిన యూనివర్సిటీ.. విద్యార్థులు కేవలం 4.5 ఏండ్ల కాలానికి మాత్రమే ట్యూషన్ ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ ఫీజును ఐదు సమాన వార్షిక వాయిదాల్లో వసూలు చేయాలని, నాలుగున్నర ఏండ్ల ఫీజు కట్టిన విద్యార్థులను ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇంటర్న్‌‌షిప్‌‌కు అనుమతించాలని స్పష్టం చేసింది.

ఇంటర్న్‌‌ షిప్ కోసం అదనపు ఫీజు అడిగినా, ఫీజు కట్టలేదన్న సాకుతో ఇంటర్న్‌‌షిప్‌‌కు అనుమతించకపోయినా ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ హెచ్చరించారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని, కాలేజీలు నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.