ఏప్రిల్ 25.. చరిత్రను మలుపు తిప్పే రోజు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఏప్రిల్ 25.. చరిత్రను మలుపు తిప్పే రోజు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
  •     తెలంగాణ భవిష్యత్​ను మారుస్తం: కవిత
  •     కొత్త రక్తం.. కొత్త రాజకీయాలతో వస్త 
  •     పప్పన్నం తింటూ.. ప్రజల మధ్యే ఉంటానని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ‘‘కొత్త రక్తం.. కొత్త రాజకీయాలతో ప్రజల ముందుకు కొత్త పార్టీ తీసుకొస్తం.. ఏప్రిల్ 25 తెలంగాణ భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చే రోజు అవుతుంది” అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్‌‌‌‌తో పాటు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఆయన అనుచరులు వెయ్యి మంది ఆమె సమక్షంలో జాగృతిలో చేరారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలను ఈ రెండు పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు. “ప్రశ్నించేది ఎవరు అంటే ప్రతి నోట జాగృతి అనే మాటే వస్తోంది” అని తెలిపారు. “సామాన్యుల చేత.. సామాన్యుల కోసం.. సామాన్యులే ఉండే రాజకీయం చేస్తామన్నారు. ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలపై పోరాడుతామని చెప్పారు. ఏప్రిల్ 25న ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ప్రజల ముందుకు సమగ్ర అజెండా తీసుకొస్తామని వెల్లడించారు.

 ఢిల్లీకి గులాంగిరీ చేస్తుండు..

రాష్ట్రంలో బీఆర్ఎస్ అచేతన స్థితిలో ఉన్నదన్నారు. గద్వాలలో చేనేత కార్మికులు, పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ఆ పార్టీ స్పందించడం లేదన్నారు. అధికార కాంగ్రెస్ అబద్ధాలతో జనాన్ని మోసం చేస్తూ ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నదని విమర్శించారు. రాహుల్​ గాంధీతో ఫోన్​లో మాట్లాడినా రేవంత్​ రెడ్డి నిలబడే ఉంటారని ఆరోపించారు. భట్టి విక్రమార్క వెళ్లి రాహుల్ కు ఫిర్యాదు చేస్తే తన సీటుకే ఎసరు వస్తుందని భయపడుతున్నారన్నారు. తెలంగాణ సమస్యలపై ‘నో’ చెప్పే రాహుల్​గాంధీ.. కేరళ ఎన్నికలకు డబ్బులు కావాలంటే మాత్రం ‘ఎస్’ చెబుతున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్​కు తెలంగాణ ఏటీఎంగా మారిందన్నారు.  

గద్వాల గడీలో ఉద్యమకారుల జెండా..

నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ ఎంతో కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి అని కవిత అన్నారు. గద్వాల్ జిల్లాలో 70 ఏళ్లుగా గడీల కుటుంబాల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. గద్వాల్ గడీలో టేకేదార్లు పోయి ఉద్యమకారుల జెండా ఎగరాలన్నారు. జాగృతి తరఫున ఆలిండియా ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీ సింహం గుర్తుతో పోటీ చేస్తే మొదటి విజయాన్ని ఇచ్చింది గద్వాల్ జిల్లానేనని ఆమె గుర్తు చేశారు.