కామారెడ్డి జిల్లాలో సమ్మర్‌ లో నీటి ఎద్దడి నివారణకు..ముందస్తు యాక్షన్ ప్లాన్

కామారెడ్డి జిల్లాలో సమ్మర్‌ లో నీటి ఎద్దడి నివారణకు..ముందస్తు యాక్షన్ ప్లాన్
  • సమస్యాత్మక ప్రాంతాల వివరాలు సేకరిస్తున్న అధికారులు
  • పైపులైన్లు, బోరు మోటార్ల మరమ్మతుకు చర్యలు
  • అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకునేందుకు సన్నద్ధం
  • గతంలో 100 హాబిటేషన్లలో తాగునీటి సమస్య 

కామారెడ్డి , వెలుగు: సమ్మర్‌లో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా యంత్రాంగం ముందస్తు యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. ఎండలు షురూ అయిన నేపథ్యంలో నీటి సమస్య తలెత్తే గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల పరిస్థితిపై అధికారులు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెల 25 వరకు సేకరించిన సమాచారాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. గత ఏడాది తాగునీటి సమస్య ఎదురైన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? కొత్తగా ఏ ప్రాంతాల్లో సమస్య తలెత్తే అవకాశం ఉంది? అనే అంశాలపై ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు.

ప్రత్యామ్నాయ వనరులు, ట్యాంకర్ల ద్వారా సరఫరా, ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకునే అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఇప్పటికే సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై రివ్యూ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆయా గ్రామాలకు నీటి సప్లై పరిస్థితులు, పైపులైన్ లీకేజీలు, బోర్ మోటార్ల పరిస్థితి, బోర్లు వట్టిపోతే, ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకునే అంశాలపై చర్యలు తీసుకునేందుకు జిల్లాయంత్రాంగం సన్నద్ధమవుతోంది.

సమస్యాత్మక మండలాలపై ప్రత్యేక దృష్టి..

ప్రతి సమ్మర్‌లో జిల్లాలోని పలు మండలాల్లో నీటి కొరత ఏర్పడుతోంది. మాచారెడ్డి, లింగంపేట, రాజంపేట, గాంధారి, సదాశివనగర్, బిచ్​కుంద, జుక్కల్, మద్నూర్ మండలాలతో పాటు కామారెడ్డి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. గతంలో సుమారు 100 హాబిటేషన్లలో తాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లో పైపులైన్ లీకేజీలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో ట్యాంకర్ల ద్వారా  నీటిని సప్లై చేశారు. ప్రస్తుతం పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు.

ఎండలు తీవ్రమైతే బోర్లలో నీటి మట్టం తగ్గే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అవసరమైతే ఈసారి కూడా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎల్లారెడ్డి, బిచ్​కుంద ప్రాంతాల్లో నీటి సమస్య రాకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు తమ పరిధిలోని నీటి వనరులు, పైపులైన్ వ్యవస్థ, బోర్ మోటార్ల పరిస్థితిపై సమగ్ర నివేదికలు సమర్పించనున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీ నిధులతో అవసరమైన మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు. క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తయ్యాక పరిస్థితిని బట్టి తగిన నివారణ చర్యలు అమలు చేస్తామని కలెక్టర్ రివ్యూ మీటింగ్​లో స్పష్టం చేశారు.