V6 News

మిల్లర్లకు నేరుగా వడ్లు..నిజామాబాద్ జిల్లాలో సర్కార్సెంటర్లలో కొనుగోళ్లు ఆలస్యం

మిల్లర్లకు నేరుగా వడ్లు..నిజామాబాద్ జిల్లాలో సర్కార్సెంటర్లలో కొనుగోళ్లు ఆలస్యం
  • 499 కేంద్రాలు ప్రతిపాదించిన సివిల్ సప్లై ఆఫీసర్లు
  •     ఇప్పటికి ప్రారంభమైంది కొన్నే..
  •     ప్రైవేట్ కు రూ.2 వేలకు అమ్ముకుంటున్న రైతులు

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​జిల్లాలో మార్చి మొదటి వారం ప్రారంభమైన యాసంగి సీజన్ పంట కోతలు దాదాపు సగం ముగిశాయి. ఈసారి రికార్డుస్థాయిలో 4.31 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 12 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 9 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్​ పెట్టుకున్న సివిల్​సప్లయ్​ఆఫీసర్లు.. కొనుగోలు సెంటర్లు ఓపెన్​ చేయడంలో మాత్రం ఆలస్యం చేశారు. మార్చి 15 నుంచి ఇప్పటివరకు జిల్లాలో మూడుసార్లు అకాల వర్షాలు, వడగండ్లు పడ్డాయి. వాతావరణ మార్పుల భయం రైతులను వెంటాడింది. 

సర్కార్ ​కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ప్రైవేట్​మిల్లర్లను ఆశ్రయించారు. దీంతో మిల్లర్లు అగ్గువకే వడ్లు కొంటూ రైతులను ముంచుతున్నారు. ఇప్పటివరక సుమారు రెండు లక్షల ఎకరాల్లోని వరి ధాన్యాన్ని మిల్లర్లే కొనుగోలు చేశారు. నాలుగు రోజుల క్రితం ఓపెన్​అయిన సర్కార్​ కొనుగోలు సెంటర్ల ద్వారా 24,713 మెట్రిక్​టన్నులు కొన్నారు. సరిగ్గా ఇదే టైంలో ప్రభుత్వం సీఎంఆర్​ నూక శాతం తగ్గించడాన్ని మిల్లర్లు వ్యతిరేకిస్తుండడంతో గోదాంల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.  

రూ.2 వేల రేట్.. 4 కిలోల తరుగు

జిల్లాలో మొత్తం 5,22, 730 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు వేయగా అందులో వరి 4.31 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. 60 వేల ఎకరాల్లో దొడ్డు రకం, మిగితా విస్తీర్ణంలో సన్నరకం పంట వేశారు. రెండూ కలిపి 12 లక్షల మెట్రిక్​టన్నుల వడ్ల దిగుబడి అంచనా వేసిన సివిల్ ​సప్లయ్ ​ఆఫీసర్లు 669 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు గత నెల 24న ప్రకటించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల కంటే వరినాట్లు ముందుగా వేసే బోధన్​డివిజన్​లో మార్చ్​మొదటి వారమే కోతలు మొదలయ్యాయి. ఈ డివిజన్​లో 1.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైన వరి కోతలు దాదాపు ముగిశాయి. 

సర్కార్ కొనుగోలు సెంటర్లు లేక కర్నాటక, హైదరాబాద్, నల్లొండ నుంచి వచ్చిన మిల్లర్లకు రూ.2 వేల రేట్​తో క్వింటాల్​కు 4 కిలోల తరుగు ఇచ్చి వడ్లు అమ్ముకున్నారు. అకాల వర్షాల భయం వెంటాడగా ఆలస్యం చేయకుండా కోతలు ముగించేశారు. గవర్నమెంట్ మద్దతు ధర ఏ గ్రేడ్​వడ్లకు రూ.2,389, కామన్​రకానికి రూ.2,369 ఉండగా రూ.2 వేలకే అమ్ముకొని రైతులు నష్టపోయారు.

ఇప్పుడిప్పుడే మొదలు

సివిల్​ సప్లయ్​ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న 669 ప్యాడీ పర్చేజ్​ సెంటర్లలో  మంగళవారం నాటికి 464 సెంటర్లు ప్రారంభమై మందకొడి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 24,713 మెట్రిక్​ టన్నులు మాత్రమే కొనగలిగారు. బోధన్​ డివిజన్​లో వరి కోతలు దాదాపు పూర్తికాగా నిజామాబాద్​ డివిజన్​లో వారం నుంచి మొదలయ్యాయి.  ఆఖరుగా ఆర్మూర్​ డివిజన్​లో జరిగే వరి కోతలతో  నిర్దేశించుకున్న 9 లక్షల టన్నుల వడ్లు కొనగలరా అన్న సందేహం వ్యక్తమవుతోంది. 

సీఎంఆర్​ నూక శాతం తేలకుంటే గోదాంల సమస్య

యాసంగి సీజన్​లో సాగు చేసిన వడ్లను బాయిల్డ్​రైస్​ కింద తీసుకుంటారు. ఖరీఫ్​లో సాగైన ధాన్యం రా రైస్​గా వాడతారు. క్వింటాల్​ వడ్లకు బాయిల్డ్​ రైస్​అయితే ​68 కిలోలు, రా రైస్​అయితే 67 కిలోల చొప్పున గవర్నమెంట్​కు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీఎంఆర్​ రైస్​లో నూక శాతాన్ని ప్రభుత్వం తగ్గించడాన్ని మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. గతంలో రా రైస్​లో 25 శాతం నూకను అనుమతించిన గవర్నమెంట్​ఇప్పుడు 10 శాతమే తీసుకుంటామని ప్రకటించింది. 

బాయిల్డ్​ రైస్​లో 16 శాతం నూకను అనుమతించి ఇప్పుడు 5 శాతమే తీసుకుంటామని తెలిపింది. ఇది తమకు నష్టదాయకమని స్టేట్​లోని మిల్లర్ల అసోసియేషన్​ ప్రభుత్వంలో సంప్రదింపులు జరుపుతున్నది. రాజీ కుదరకపోతే   మిల్లర్లు సెంటర్ల వడ్లను తీసుకునే అవకాశం లేదు దీంతో గోదామ్​ల సమస్య ఉత్పన్నమై కొనుగోళ్లపై ఎఫెక్ట్​పడుతుందని ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు.