ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల యుద్ధంతో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆర్మూర్ లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూపాయికే వైద్యం అందించాలని, ప్రతి గ్రామానికి సొంతంగా పది ఇండ్లు కట్టియ్యాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఇంటి ముట్టడి పేరిట సోమవారం ఛలో అంకాపూర్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే తాను యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తుగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ర్యాలీ, రాస్తారోకో, ధర్నాలకు అనుమతి లేదన్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
