ఆర్మూర్లో హైటెన్షన్.. కర్రలు పట్టుకొని కూర్చున్న బీజేపీ లీడర్లు..చలో అంకాపూర్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులు

ఆర్మూర్లో హైటెన్షన్.. కర్రలు పట్టుకొని కూర్చున్న  బీజేపీ లీడర్లు..చలో అంకాపూర్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులు
  • కాంగ్రెస్ కార్యకర్తలను గృహనిర్బంధం చేసిన పోలీసులు

ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్​జిల్లా ఆర్మూర్ లో సోమవారం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, ఎన్నికలకు ముందు రాకేశ్ రెడ్డి ఇచ్చిన రూపాయికే వైద్యం, ప్రతీ ఊరిలో పది ఇండ్ల హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు సోమవారం చలో అంకాపూర్​కు పిలుపునిచ్చారు. 

ఈ విషయం తెలుసుకున్న రాకేశ్ రెడ్డి తాను యుద్ధానికైనా సిద్ధమేనంటూ మార్కెట్ వద్ద కూర్చుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, పలువురు నాయకులు రాకేశ్ రెడ్డి ఇంటికి రాగా... అందరూ కలిసి కర్రలు పట్టుకొని ఎమ్మెల్యే ఇంటి గేటు వద్ద కూర్చున్నారు. 

కాంగ్రెస్​నేతల గృహ నిర్బంధం

అంకాపూర్ వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్​నాయకులను పోలీసులు ఎక్కడిక్కడే అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆర్మూర్ లోని పీవీఆర్​భవన్​నుంచి బయలుదేరేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్​కుమార్​రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్​గోనె లహరితో పాటు కాంగ్రెస్​ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరో వైపు అంకాపూర్​వరకు వెళ్లిన కొందరు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు.


కాంగ్రెస్​ నాయకుల మెడలో చైన్లు లాక్కోండి : ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పినందున కాంగ్రెస్ నేతల మెడల్లో ఉన్న గోల్డ్ చైన్లు లాక్కోవాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాననన్నారు. ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఫాంహౌస్ లో పడుకున్నందున నిజమైన ప్రతిపక్షం తామేనన్నారు. 

ఎమ్మెల్యేపై ఫిర్యాదు

కాంగ్రెస్​నాయకుల షోరూంల నుంచి స్కూటీలు, మెడలోంచి బంగారం ఎత్తుకుపోవాలని వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్మూర్​ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్​రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్​మహేశ్ కుమార్ గౌడ్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.