V6 News

టీయూలో మళ్లో రిజిస్ట్రార్ ​నియామకం!

టీయూలో మళ్లో రిజిస్ట్రార్ ​నియామకం!
  • ప్రొఫెసర్​కనకయ్యకు వీసీ అపాయింట్​మెంట్ లెటర్
  • వెంటనే బాధ్యతల స్వీకరణ
  • వర్సిటీలో ఆసక్తికర పరిణామం 

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్​ నియామకం పిల్లలు ఆడుకునే కుర్చీలాటను తలపిస్తోంది. తాజాగా యూనివర్సిటీ కొత్త రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్​ కనకయ్యను నియమిస్తూ వీసీ రవీందర్ ​గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొదట వీసీ రవీందర్ ​గుప్తా రిజిస్ట్రార్​గా విద్యావర్ధినిని నియమించారు. యూనివర్సిటీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకుంది. దీంతో యాదగిరిని రిజిస్ట్రార్ ​చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం..ఇది ఒప్పుకోని వీసీ రవీందర్​ మళ్లీ ఓయూ ప్రొఫెసర్​ నిర్మలా దేవిని నియమించడం చకచకా జరిగిపోయాయి.

అయితే, ఉన్నత విద్యామండలి ఒత్తిడితో నిర్మలా దేవి తిరిగి ఓయూలో రిపోర్ట్ చేయగా, తిరిగి యాదగిరినే ఈసీ రిజిస్ట్రార్​గా నియమించింది. పట్టు వదలని వీసీ వర్సిటీలోని రిజిస్ట్రార్​ చాంబర్​కు తాళాలు తీయొద్దని ఆదేశించడంతో రిజిస్ట్రార్​ యాదగిరి వేరే చాంబర్​లో కూర్చోవాల్సి వచ్చింది. ఆ టైంలోనే  మాట్లాడిన వీసీ రవీందర్ ​గుప్తా రిజిస్ట్రార్​ను నియమించే అధికారం తనకే ఉందని, త్వరలోనే కొత్త రిజిస్ట్రార్​ పేరు ప్రకటిస్తానన్నారు. ఆయన అన్నట్టుగానే శుక్రవారం ప్రొఫెసర్​ కనకయ్యను రిజిస్ట్రార్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అపాయింట్​మెంట్​ లెటర్​ కూడా అందజేశారు. వెంటనే కనకయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఈసీ ఎలా స్పందిస్తుందోనని, ఉన్నత విద్యా మండలి ఏం స్టెప్ ​తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈసీ తిరస్కరిస్తే వీసీ మళ్లీ ఏం చేస్తారోనని చర్చించుకుంటున్నారు.