ఈమధ్య కాలంలో మాదిగ దండోరా నాయకుడు మంద కృష్ణ మాదిగ క్రిస్టియన్లుగా మారిన దళితులు రిజర్వేషన్లకు అర్హులు కారని సుప్రీంకోర్టు తీర్పుపై పత్రికా సమావేశాలుపెట్టి మాట్లాడాడు. ఆయన వాదనలను కొన్ని బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తూ దూషణ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టారు. మంద కృష్ణను వ్యతిరేకించే క్రమంలో శ్రీకృష్ణని చర్చను అందులోకి తెచ్చారు. అందులో భాగంగా ‘భగవంతుడు మంత్రాధీనం మాత్రం బ్రాహ్మణాధీనం’ అని ప్రకటించి శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల కాళ్లు కడిగి ఆ నీళ్లను తన నెత్తిమీద పోసుకున్నాడని బాహాటంగా చెప్పారు. అలా చెప్పినవాళ్లు చాలామంది దైవంగా భావించే శ్రీకృష్ణుడిని బ్రాహ్మణుల పాదాక్రాంతుణ్ణి చేశారు. శ్రీకృష్ణుడు భగవద్గీత రచయిత అని.
ఆ గ్రంథమే హిందూమత మూలగ్రంథమని వాళ్లే చెబుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్లు శ్రీకృష్ణుడు మా పాదాలు కడిగి నెత్తిన పోసుకుని శూద్రుడని స్పష్టంగా చెప్పారు. శ్రీకృష్ణుడు మా దేవుడని మనకాలంలో యాదవులు భావిస్తారు. శ్రీకృష్ణుడు ఆయన సోదరుడు బలరాముడు పశువుల కాపరులైన యధువంశంలోనివారు. వాళ్లు పశుపాలకులని చెప్పే కథలు చాలా ఉన్నాయి. బ్రాహ్మణ సంఘ నాయకులు శ్రీకృష్ణుడు
మా పాదాలు కడిగాడు అని చెప్పుకోవడాన్ని మాదిగ నాయకులు వ్యతిరేకించారుగానీ, యాదవులుగాని, ఇతర శూద్రులుగాని ఎవ్వరూ నోరిప్పి వ్యతిరేకించిన స్థితిలేదు. అయితే, పైన పేర్కొన్న బ్రాహ్మణ వాదనలో శూద్రులందరికీ ఒక మెసేజ్ ఉంది.
హిందూ మతంలోని దేవతలందరూ మా మంత్రాధీనులే, అంటే మేం చెప్పినట్లు వినేవారే అని అర్థం. వందల ఏండ్లుగా శూద్రులు బ్రాహ్మణ పూజారులను పెండ్లికి, చావుకి, కొన్ని పండుగలకు మంత్ర పఠనానికి పిలుస్తారు. పెద్ద మొత్తంమీద దక్షిణ (డబ్బు, ధాన్యం) ఇస్తున్నారు. నిజానికి దళితులకు, బ్రాహ్మణ పూజారులకు ఏనాడూ సంబంధం లేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది దళితులు బ్రాహ్మణ పూజారులను పిలిచి పెండ్లిళ్లు చేసుకుంటున్నారు. శూద్రులందరికీ మందకృష్ణ వ్యతిరేకత పేరుతో బ్రాహ్మణ నాయకులు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. మీరు మోక్షం కోసమో, సంపద కోసమో, దీర్ఘ ఆయుషు కోసమో పూజించే దేవతలు మా మంత్రాలకు లోబడి ఉండేవారే. అయితే ఆ మంత్రం సంస్కృతంలో ఉంటుంది. అది ఒకప్పుడు శూద్రులు నేర్చుకుని, పూజారి ఏం చెపుతున్నాడో అర్థం చేసుకునే హక్కు లేదు. సంస్కృతం నేర్చుకుంటే నాలుకలు కోయడం చేయడం వంటివి వారు విధించిన దండనా విధానాలు. వేదాలు రాసిన దగ్గర నుంచి ఈనాటివరకు వారు పెండ్లి తంతులో చదివే మంత్రాలు శూద్రులెవ్వరికి అర్థంకావు. మరి ఈ శూద్రుల గురిచి దేవుళ్లకు ఏం చెప్పారు? బ్రాహ్మణ నాయకులే ప్రెస్ కాన్ఫరెన్సులో చెప్పినట్లు దేవుళ్లు వాళ్లు చెప్పినట్టు చేయవలసిందే.
మరి ఇన్ని వందల సంవత్సరాలు ఈ పూజారులు దేవతలకు శూద్రులకు చదువు రానియ్యవద్దు. ధనధాన్యాలు పెరగనియ్యవద్దు, మేధావులు కానివ్వొద్దు అని చెప్పి ఉండవచ్చుకదా! అందుకే వారికి అర్థంకాని భాషలో మంత్రం చదవడమా! అంతకంటే భయానకమైన ప్రకటన ఏమంటే శ్రీకృష్ణుడే, భగవద్గీత రచయితే మా కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నాడంటే ఇప్పుడు ఈ భూమి మీద, ఈ భరతఖండం మీద శూద్రులందరినీ ఏం చేయమంటున్నారు. ఓ శూద్రులారా, మా కాళ్లు దగ్గర పడి ఉండండి. లేకపోతే దేవతలచేతనే మిమ్మల్ని శిక్షింప చేస్తామని చెప్పడమే కదా! రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు, కమ్మలు, కాపుల నుంచి చాకలి, మంగళి వరకు శూద్రులే కదా! వారి కుల పునాదులు కలిగిన కృష్ణుడే మా పాదాక్రాంతుడని చెబుతున్నారు కదా! ఇప్పడు దళితులే కాదు శూద్రులు ఏమనుకోవాలి?
దళితుల అంటరానితనం
దళితుల అంటరానితనం ఈ దేశంలో ఎక్కడి నుంచి మొదలైంది? ఈ సమాజమంతా పశుసంపదతో బతుకుతున్న రోజుల్లో తోలును ఒక వ్యవసాయ వస్తువుగా మార్చింది దళితులే కదా! ఆ తోలును నీచ వస్తువని డిక్లేర్ చేసిందెవరు? ఈ రోజు శూద్రుడైనందుకే శ్రీకృష్ణుడిని తమ పాదాలు కడిగిన వ్యక్తిగా ప్రకటించిన పూజారి వర్గమే కదా! తోలు స్క్రోల్స్ మీద సంస్కృత అక్షరాలు రాయ నిరాకరించి, తాళ పత్రాలు మీద రాయడంతో కదా తోలు సైంటిస్టు అంటరానివారుగా చెయ్యబడ్డది.
ఆనాడు రాత అనే ప్రక్రియ శూద్రుల చేతుల్లో లేకుండా చేసింది కూడా వీళ్లేకదా! ఇయ్యాల ఆ దళితులు తోలును గౌరవించి ఆదిమ దశ నుంచి తోలు స్క్రోల్స్మీద బైబిల్ రాసుకున్న క్రిస్టియానిటీలోకి పోతామంటే వ్యతిరేకించేది ఎవరు? శూద్రులు ఏనాడూ వ్యవసాయరంగంలో మాదిగలు చేసిన తోలు పనిముట్లను వాడం అని నిరాకరించలేదు.
నాగలికి వారెన్లు, మోటబొక్కనకు తొండం, మంచినీరుతాగే తోలుతిత్తి శూద్రులు నిరాకరించి ఉంటే వ్యవసాయమే నడిచేది కాదు. సంస్కృత పూజారి వర్గం తోలు, తోలు పనిముట్లు చేసే మనుషులు అంటరానివారన్న ఆలోచనను శూద్రుల్లో చొప్పించి చివరికి శూద్రులను కూడా దళితులకు దూరంబెట్టిన సిద్ధాంతవేత్తలు కారా ?
అసలు మానవుల మధ్య శరీర అంటరానితనం సిద్ధాంతం ఎవరు గ్రంథాల్లో రాశారు? శ్రీకృష్ణుడా, బ్రాహ్మణ రుషులా? ఈ మొత్తం చర్చ శూద్ర జాతికంతా ఒక గుణపాఠం నేర్పేదిగా ఉంది. దేవతలని హిందువులు భావించే బ్రహ్మ, విష్ణువు, బ్రాహణుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నారని చెప్పగలరా! ఒక్క శ్రీకృష్ణుని గురించే అలా మాట్లాడుతున్నారు ?
శూద్రుల కర్తవ్యం
ఆధ్యాత్మిక రంగంలో మానవులు నమ్మే దేవునికి మానవులతో నేరుగా సంబంధం లేకుండా చేసిందే ఈ పూజారి వర్గం. ఈ వర్గం అన్నిమతాల్లో ఉన్నది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన శూద్రుల ఆధ్యాత్మిక చైతన్యాన్ని దెబ్బతీసి తమ దేవునికి వారికి మధ్య డైరెక్టు సంబంధాన్ని తెంపేసి పూజారివర్గం మొత్తం శూద్ర సమాజాన్ని అభివృద్ధి కాకుండా చేశారు. దేవునికి శూద్రులకు మధ్య ఉండే భాష సంబంధాన్ని తెంపేశారు. ఇక్కడే మొత్తం శూద్ర సమాజం జ్ఞానాన్ని, ఆర్థిక వనరులను, మోక్షం అని వారు భావించే విలువను తాకట్టు పెట్టారు. ఇప్పటికి ఆ ఉచ్చు నుంచి వారు బయటకి రాలేదు.
భూమి మీద ఒక మతంలోని ఆడ, మగ కలిసి తినకుండా కుల, లింగ, అంటరానితనాన్ని ప్రచారం చేసి అదే మత విలువ అని చెప్పాక వీరంతా ఒకే స్వర్గంలో కలిసేట్టు ఉంటారా? ఒక మతంలో ఉన్న స్త్రీ–పురుషులకు ఒకే స్వర్గం ఉందా లేక కులానికి ఒక స్వర్గం, స్త్రీలకు ఒక స్వర్గం, పురుషులకు ఒక స్వర్గం ఉందా! ఈ భూమి మీద అంటరానితనంపై దేవునితో నేరుగా మాట్లాడుకునే హక్కు కోసం ఇతర మతాల్లోకి దళితులు మారితే వారిని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరిపాలించే రాష్ట్రాలు వారిని గోస పెడుతున్నాయి.
వారి మీద దాడులు, కోర్టు కేసులు, ఎఫ్‌సీఆర్ ఏ క్యాన్స్లేషన్, మతమార్పిడికి వ్యతిరేక చట్టాలు చేస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి దళిత క్రిస్టియన్లలను హింసించని మార్గంలేదు. దురదృష్టవశాత్తు శూద్రులు, ఓబీసీలు వీరి ప్రభుత్వంలో మాకు అన్నీ వస్తాయని భ్రమించి ఈ అణచివేతకు మద్దతిస్తున్నారు.
ఓబీసీ మోదీ నామమాత్ర పరిపాలకుడే..
మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ మేమే ఇప్పించాం. దళిత క్రిస్టియన్లకు సపోర్టు చేస్తే దాన్ని తీసేయిస్తాం అని పూజారివర్గం బాహాటంగా ప్రకటిస్తోంది. దీనర్థం ఏమిటి? ఓబీసీ మోదీ నామమాత్ర పరిపాలకుడే. గత 11 సంవత్సరాలలో ఒక శూద్రుడైనా అతి పెద్ద పెట్టుబడిదారుల్లో ఒక్కడన్నయ్యాడా! ఒక స్త్రీ జాతీయస్థాయి శూద్ర, లేదా దళిత పెట్టుబడిదారిగా ఎదిగిందా? ఆ మార్గాన్ని కూడా మత పూజారులు శాసిస్తున్నారు.
కానీ, ఈనాడుగాని, గత మూడు వేల ఏండ్లుగా .. అంటే రుగ్వేదం వారు రాసుకున్న దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తిలోగాని, కుటీర పరిశ్రమలోగాని, పశుపోషణలోగాని ఈ పూజారి కులంలేదు. అయినా అన్ని రకాల వనరులు వీరి చేతిలోకే చేరాయి. తెలంగాణ కులగణనలో తేలిన లెక్కల ప్రకారం బ్రాహ్మణులు అతి చిన్న కులంగా ఉండి కూడా 16.4 శాతం కార్లు కలిగి ఉన్నారు.
వారి తరువాతనే రాజులు, కమ్మలు, కాపులు, కోమట్లు, వెలమలు కార్లు కలిగి ఉన్నారు. బ్రాహ్మణ మేధావులు రాసుకున్న గ్రంథాలే వర్ణాశ్రమ ధర్మం ప్రకారం యవ్వనం తరువాత వాళ్లు కౌమార్య, వృద్ధాప్యంలో ఏ ఆస్తి కలిగి ఉండకూడదు. శూద్రులకు ఆ నియమం లేదు.
కానీ వీరు దగ్గర ఉన్న కార్లు, బంగ్లాలు, బంగారం, ఇంగ్లిష్ విద్య, విదేశీ ప్రయాణం ఏం సూచిస్తున్నాయి? మూడువేల ఏండ్లు సర్వ చాకిరి చేసి కనీసం అంటరానితనం నుంచి తప్పించుకుందామనే దళితులు క్రిస్టియన్ మతంలోకిపోతే ఇప్పడు బతుకుదెరువే లేకుండా చేస్తునారు. శూద్రులు కూడా ఇటువంటి అవమానకర ఆధ్యాత్మిక సిద్ధాంతాలను చూస్తూ ఊరుకుంటే వీరినందరిని ఆధ్యాత్మికంగా అణచివేస్తూ , ఆర్థికంగా ఎదగనీయకుండా, మేధావితనం శూద్రుల చెంతకు రానీయకుండా మరో మూడువేల ఏండ్లు పాలించే క్రమం కనబడుతున్నది. శూద్రులు మేల్కొంటే తప్ప ఈ స్థితి మారదు.
ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.

