నీట్ పేపర్ లీక్ సమస్యపై కాక్రోచ్ జనతాపార్టీ, విద్యార్థులు అభిజిత్ దీప్కే నాయకత్వంలో మొదలెట్టిన ఉద్యమం దాదాపు 26 రోజులు నుంచి నడుస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వాళ్ల కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది. అభిజిత్ ఒక యువ గౌరవప్రద క్రియేటివ్ నాయకుడుగా దేశానికి కనబడుతున్నాడు. విద్యార్థులు, యువకులు అతని వెంట నిలిచిన విధానం దేశానికే ఒక కొత్త ఆశను కలిగించింది. ఉద్యమంలోకి సోనమ్ వాంగ్‌చుక్ ఎంట్రీ కీలకంగా మారింది. ఈ ఉద్యమంలోకి లడక్ ఉద్యమకారుడు ఎంటర్ అవడం మంచిదే. వాంగ్‌చుక్ జైలు నుంచి బయటకు వచ్చాక ఆయనకు దేశంలో కొంత గుర్తింపు వచ్చింది. అయితే ఆయన అకస్మాత్తుగా సచ్చేవరకు ఉపవాసం ప్రకటన నన్ను అయితే ఆశ్చర్యపరిచింది. ఈ పోరాట రూపాన్ని మహాత్మా గాంధీ ఉపయోగించి కాంగ్రెస్‌కు అధినేత అయ్యారు. కానీ అది బ్రిటిష్ కాలంలో. బ్రిటిష్ పాలకులకు వారి మత విలువల నుంచి వచ్చిన ‘దయ’ గాంధీ ఉపవాస దీక్షకు నిరంతరంగా రెస్పాన్స్‌నిచ్చేది. ఆకలితో చనిపోయే మానవులను పాలకులు, లేదా చుట్టూ ఉన్న ప్రజలు ఆదుకోవాలనేది ఒక సమాజ లేదా మతవిలువ అయినప్పుడు ఉపవాస దీక్షకు గౌరవం ఉంటుంది. కానీ, ఈ ప్రభుత్వానికి అది ఉందా?
గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉపవాస దీక్ష చేసి చనిపోతాడనుకున్నప్పుడు ఆ చావును ఆపగలిగిన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్. ఆయనకు బుద్ధుని నుంచి వచ్చిన విలువలు, కరుణ, దయ, మానవత్వం. అయితే గాంధీ ఆ బుద్ధిస్టు విలువలకు వ్యతిరేకంగా వేల ఏండ్లు హిందూ మత కరుణ, దయ, మానవత్వ విలువలను పట్టించుకోని విలువలతో వేలాదిమంది ఆకలితో, శ్రమ భారంతో దళితులు చనిపోయినా... దళితులకు చదువు కావాలి, ఉద్యోగాలు కావాలి అని అంబేద్కర్ చేసిన ప్రతిపాదనను గాంధీ వ్యతిరేకించి.. నేను ఉపాసముండి చస్తానంటే అంబేద్కర్ కరుణతో, దయతో ఆయన డిమాండ్‌తో రాజీపడి గాంధీని రక్షించాడు. లేకపోతే ఆ ఆకలి దీక్షలో గాంధీ చనిపోయేవాడు. దాని తరువాత ఎంతోమంది దళితులను గాంధేయవాదులు అహింసా సిద్ధాంతం పక్కకుపెట్టి ఊచకోత కోసేవారు కావచ్చు. కానీ గాంధీ మాత్రం ఆ రోజే చనిపోయేవాడు. అంబేద్కర్ ఈ పద్ధతిని ‘గ్రామర్ ఆఫ్ అనార్కీ’ అన్నాడు.
మోహన్ భగవత్ అంబేద్కర్ కాదు
మీడియాతో సహా దేశంలోని చాలామంది ఏమనుకుంటారంటే నరేంద్ర మోదీ వాంగ్‌చుక్‌ను కాపాడాలనుకుంటే ధర్మేంద్ర ప్రధాన్‌ను మారుస్తానని చెప్పి వాంగ్‌చుక్ నిరాహార దీక్షను అపవచ్చు. సీజేపీ పోరును ఆపవచ్చు అని. కానీ మోహన్ భగవత్ ఆజ్ఞ లేనిదే మోదీ ఏం చేయలేడు. అసలు పవర్
ఆర్ఎస్‌ఎస్ దగ్గర ఉంది.
ఆర్‌ఎస్ఎస్ ఉపవాస దీక్షను గౌరవిస్తుందా?
ఆనాడు గాంధీ ఉపవాస దీక్షనుగాని, దాని 100 ఏండ్ల చరిత్రలో మరో ఉపవాస దీక్షనుగాని అది గౌరవించిన దాఖలాలు లేవు. ఆ పోరాట రూపాన్నే అది అంగీకరించినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. సంస్థగా ఆర్ఎస్ఎస్‌గాని, పార్టీగా బీజేపీగాని గుర్తింపు కలిగిన ఉపవాస దీక్ష వాళ్ల డిమాండ్ల మీద చేసిన ఉదాహరణలు లేవు. వాంగ్‌చుక్ చనిపోతే ఆర్ఎస్‌ఎస్, బీజేపీ పాలనకు ముప్పు వస్తుంది అనే భయం వారికి అసలే లేదు. ఆయన చావు ప్రభావం ఎన్నికల మీద పడుతుందనే భయం అంతకన్నా లేదు. ఎన్నికలు ఎట్ల గెలవాలో ప్రపంచంలో ఏ సంస్థ, పార్టీ కనిపెట్టని విధానాన్ని వారు కనిపెట్టారు.
మోరల్ బాధ్యతగా రిసిగ్నేషన్ ఆలోచన
సీజేపీదికాని, వాంగ్‌చుక్‌దిగాని నీట్ పేపర్ లీక్‌కు మోరల్ బాధ్యునిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. కానీ ధర్మేంద్ర ప్రధాన్.. లాల్ బహదూర్ శాస్త్రి కాదు. ఆయన ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో కాదు. గత ప్రభుత్వాల్లో చాలాసార్లు ఒక మంత్రి శాఖలో ప్రమాదాలు, అవినీతి, ప్రజలు ద్వేషించుకునే సంఘటనలు జరిగినప్పుడు మంత్రులు వాళ్లంతవాళ్లే మనస్తాపంతో రిజైన్ చేశారు. అది లాల్ బహదూర్ శాస్త్రితో మొదలైంది. అంతకుముందు ప్రభుత్వంలో అనుకున్నది జరగడం లేదని అంబేద్కర్ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఆ తరువాత చాలామంది చేశారు. ఎవరైనా మోరల్ బాధ్యతగా రాజీనామా చేయనంటే లేదా ప్రజాభిప్రాయాన్ని చూసి ప్రధానమంత్రి చేయించేవాడు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న 17 ఏండ్లలో (1999–2004, ఆ తరువాత 2014 నుంచి) ఎప్పుడూ అలా జరగలేదు. మోరల్ బాధ్యత అనే విలువ ఆర్ఎస్ఎస్, బీజేపీ డిక్షనరీలో ఉన్నాయా? ఏది మోరాలిటీ, ఏది కాదు అనేది వారి నిర్వచనం వేరు. ఒక సంస్థ చట్టప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థను నడపడం ఇమ్మోరాలిటీ అనుకోనప్పుడు మిగతా అంశాల్లో మోరాలిటీ, ఇమ్మోరాలిటీ అనే చర్చ వారి మధ్య ఎలా వస్తుంది. పోనీ ధర్మ, అధర్మ భాషలో చర్చించినా వారి నిర్వచనం సాధారణంగా ప్రజలు మాట్లాడుకునే మీనింగ్‌లో వారి నిర్వచనం ఉండదు. అది విభిన్న దృక్పథంలో వ్యవస్థను నడుపుతుంది. వారి జాతీయవాదానికి కూడా అర్థం వేరు. అటువంటప్పుడు ఒక మంత్రిని మోరాలిటీ ఆధారంగా ఎందుకు రాజీనామా చేయమంటారు.
కాంగ్రెస్ వైఖరి
18 జులైన సోనియా గాంధీ కాంగ్రెస్ వాంగ్‌చుక్‌కు, దీక్షకు సపోర్టు చేస్తుంది అని ప్రకటించేవరకు అది పట్టించుకోలేదు. అది పాలక పార్టీల వైఖరిలో భాగం కావచ్చు. కానీ సీజేపీ పుట్టిందే ఆర్ఎస్ఎస్, బీజేపీలు యువకుల విద్య, ఉద్యోగాల అవకాశాలను దెబ్బతీస్తూ ఉన్న తరుణంలో. దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడంతో మొదలైంది. అభిజిత్ దీప్కే అనే విద్యావంతుడైన దళిత యువకుడు ఈ పార్టీని ఎంతో చాకచక్యంగా ప్రారంభించాడు. యువకుల్లో సీజేపీకి వచ్చిన ఆదరణకు భయపడి ప్రభుత్వం ఆ అకౌంట్‌నే ఆపేసింది. ఇది పెద్ద రాజకీయ, ప్రచార స్వేచ్ఛ హక్కుకు భంగం. దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కులాలతో సంబంధం లేకుండా నిర్బంధాన్ని ఛేదించి పోరాడుతుంటే ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ దానికి మోరల్ మద్దతు ఇవ్వకపోవడం చాలా నష్టం తెచ్చింది. అభిజిత్ దీప్కే ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతకాలం పనిచేయవచ్చు. కానీ ఇప్పుడు తను ముందుకుతెచ్చిన పోరాటం దేశ భవిష్యత్‌కు సంబంధించినది కదా! ఇప్పడైనా ప్రతిపక్షాలు ఈ ఉద్యమానికి పూర్తి మద్దతిచ్చి యువ శ్రేణులతో దేశంలో ఆర్గనైజ్ చేయడం చాలా అవసరం.
గతంలో..
నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగా కూడా పొట్టి శ్రీరాములు 56 రోజులు ఉపవాస దీక్షచేసి చనిపోయాడు. అయితే అప్పుడు తెలంగాణ ప్రాంతం భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రలో కలవడానికి వ్యతిరేకంగా, పొట్టి శ్రీరాములు ఆకలి దీక్షకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం ఉండింది. ఆయన చనిపోయాక దేశమంతా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలి అనే డిమాండ్ వచ్చాక సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ 2014లో మళ్లీ అది విడిపోవాల్సి వచ్చింది. ఆనాటి నెహ్రూ ప్రభుత్వ తటపటాయింపునకు ఒక చరిత్ర పునాది ఉంది. కానీ ఇప్పుడు వాంగ్‌చుక్ చనిపోయినా ఫరవాలేదు అని బీజేపీ పట్టించుకోకుండా ఉండడానికి అటువంటి కారణం ఏమీలేదు. ఈ ఉపవాస చావులను మేం లెక్కచేయం అనే వైఖరి తప్ప.
ఈ విద్యార్థి ఉద్యమం కూడా చాలా చిన్న డిమాండ్‌తో నడుస్తోంది. పేపర్ లీక్‌లు ఆపాలి. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేస్తే దేశానికి వచ్చే నష్టం ఏమీలేదు. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ అటువంటి మోరల్ బాధ్యతను అంగీకరించవు.
అన్ని పార్టీలు మద్దతివ్వాలి
ఉపవాస దీక్షల మీద నాకు నమ్మకం లేదు. కానీ సీజేపీ ప్రారంభించిన ఒక మహత్తర యువ ఉద్యమంలో దేశంలోని అన్ని ప్రాంతాల యువకులు పాల్గొని విద్యా వ్యవస్థను కాపాడవలసి ఉంది. ఇప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కేవలం పాతకాలపు సంస్కృత పుస్తకాలను చదువుతూ డిగ్రీలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన.
ఈ చదువు భవిష్యత్తుకు ఉత్పత్తిని పెంచడానికి, శ్రమ గౌరవాన్ని పెంచడానికి, సైన్సును అభివృద్ధి చేయడానికి పనికిరాదు. అందుకే ఆర్ఎస్‌ఎస్ అధీనంలో లేని పార్టీలు సంస్థలు ఈ విద్యావ్యవస్థను మార్చే యువకుల ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే దేశ చైతన్యం సచ్చిపోతుంది. అన్ని కులాల యువకులు మంచి విద్యావంతులు కావడం ఇప్పుడున్న పాలకులకు అస్సలు ఇష్టం లేదు. కనుక అన్ని పార్టీలు యువకుల పోరాటానికి మద్దతివ్వాలి.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
