- డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, వెలుగు: బెంగాల్, కేరళం, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందే హెచ్చరించారని, ఆయన చెప్పినట్లే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సామాన్యుల నడ్డి విరిచేలా రేట్లు పెంచుతోందని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ కరీంనగర్‌లోని ఇందిరా చౌక్ వద్ద డీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంతోపాటు మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఎడ్ల బండ్ల పై ఎక్కి నిరసన తెలపగా, పార్టీ శ్రేణులు రిక్షా, సైకిళ్లపై కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
మల్యాల, వెలుగు: మల్యాల మండలంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన బీజేపీ లీడర్నేరెళ్ల శ్రావణ్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఆనంద్ రెడ్డి, శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఆదిరెడ్డి, వినయ్, సతీష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
