తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామ పంచాయతీలో నిధుల గోల్‌మాల్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఖాతాలో ఉన్న సుమారు రూ.4 లక్షలను సర్పంచ్‌కు తెలియకుండా పంచాయతీ కార్యదర్శి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మొగిలిపాలెం సర్పంచ్ తాట్ల తిరుపతి ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీపీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
