కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పట్టణంలో ఖాళీ ప్లాట్లను గుర్తించి, వాటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ముఠాను టూ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ సృజన్ రెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన కిన్నెర మల్లవ్వ, గన్నేరువరం మండలం చీమకుంటపల్లికి చెందిన భామండ్ల రవీందర్, లోకిని పోచయ్య, అనుముల బాలయ్య, లోకిని ఆదిత్య, లోకిని రాజవ్వ ముఠాగా ఏర్పడి కరీంనగర్ చుట్టుపక్కల భూముల నకిలీ పత్రాలు సృష్టిస్తారు.
తమలో ఒకరి పై రిజిష్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్‌తో ముఠాలోని మరొకరి పేరుపై మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలా ప్లాట్స్ కి లింకు డాక్యుమెంట్లు సృష్టిస్తారు. ఈ నకిలీ లింక్ డాక్యుమెంట్లతో అమాయకులకు భూములు అమ్మి డబ్బులు పంచుకుంటారు. ఇదే పద్ధతిలో కరీంనగర్‌లోని పద్మనగర్ ఏరియాలో సర్వే నెంబర్. 212 లో గల 242 చదరపు గజాల ప్లాట్ ను నకిలీ లింక్ డాక్యుమెంట్లతో కబ్జా చేసి వేరే వ్యక్తులకు అమ్మారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
