కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. మోయ తుమ్మెద వాగు నుంచి కొద్దిగా ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు మూడు గేట్లను తెరిచారు. ఎస్సారెస్పీ సీఈ శంకర్ మూడు గేట్లను అర ఫీటు మేరకు ఎత్తి 3000 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి వదిలారు .
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించి డ్యాంలో నీరు 23 టీఎంసీలకు చేరుకుంది. దీంతో కొద్ది రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్ మూడు గేట్లు ఎత్తి ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే ఇన్ ఫ్లో తగ్గడంతో మళ్లీ గేట్లు మూసేశారు. కానీ గురువారం నుంచి మళ్ళీ 7292 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో శుక్రవారం మూడు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని మానేరు లోకి వదిలారు. అదే విధంగా కాకతీయ కాలువ ద్వారా మరో 2500 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కోసం 303 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కింద వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 920 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 919.65 అడుగులు ఉంది. 24.034 టీఎంసీలకు గాను 23.732 టిఎంసిల నీరు డ్యాం లోకి వచ్చి చేరింది.
