మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా సునీల్‌రావు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మేయర్ స్థానంపై రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికలో బీఆర్‌ఎస్ తటస్థ వైఖరి అవలంభించడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులు బీజేపీకే దక్కాయి. రెండో డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా, మాజీ మేయర్ సునీల్‌రావు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు చివరి వరకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
కరీంనగర్ కార్పొరేషన్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఎంఐఎం, ఏఐఎఎఫ్‌బీ కార్పొరేటర్ల మద్దతుతో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఆకుల నర్మద పేరును ప్రతిపాదించగా ఆమెకు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్‌కు 30 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి మొత్తం 34 ఓట్లు రావడంతో మేయర్‌గా ఎన్నికయ్యారు.
తర్వాత కాంగ్రెస్, మజ్లిస్ తరఫున డిప్యూటీ మేయర్‌గా హీనా అఫ్రీన్ పోటీ చేయగా.. 22 ఓట్లు వచ్చాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావుకు 34 ఓట్లు రావడంతో ఆయన విజయం ఖాయమైంది. తొమ్మిది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ సభకు హాజరైనా తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల గెలుపు ఈజీ అయింది. కరీంనగర్ మేయర్ పదవిపై బీజేపీలోని బీసీ కార్పొరేటర్లంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఏబీవీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగిన కొలగాని శ్రీనివాస్ పేరును ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది.
