- మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ టౌన్, వెలుగు: బీజేపీపై నమ్మకంతో ప్రజలు కరీంనగర్ కార్పొరేషన్‌లో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతతో పనిచేస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం సిటీలోని 66వ డివిజన్‌లో రూ.13.5లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను డిప్యూటీ మేయర్ సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌లో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించిన సిటీ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. బాధ్యతతో పనిచేసి బల్దియాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మేయర్ అన్నారు.
వారంలో ఒకరోజు డివిజన్లలో పర్యటించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. విలీన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రధాన దృష్టి సారించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగల పవన్, బండ రమణారెడ్డి, తాటి ప్రభావతి, వేణు ప్రసాద్, కేపీ చంద్ర, శ్రీనివాస్, లీడర్లు కృష్ణ, జ్యోతి, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
