కరీం నగర్ జిల్లాలో మిల్లర్స్ అసోసి యేషన్ లీడర్ మిల్లులో వడ్లు మాయం ? 

కరీం నగర్ జిల్లాలో మిల్లర్స్ అసోసి యేషన్ లీడర్ మిల్లులో వడ్లు మాయం ? 
  • 20 వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం పక్కదారి 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. అధికారుల అండదండలతో కోట్లాది రూపాయల విలువైన సీఎంఆర్ ఎగవేసిన పలువురు మిల్లర్ల మిల్లుల్లో అప్పటి ధాన్యం గింజ కూడా కనిపించడం లేదు. ఈ వ్యవహారంలో కొందరు మిల్లర్స్ అసోసియేషన్ నాయకులే సివిల్ సప్లయ్ ఆఫీసర్లకు డీఫాల్ట్ మిలర్లకు మధ్యవర్తులుగా ఉండి వ్యవహారాన్ని చక్కదిద్దారనే ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌‌లో కీలక పదవిలో ఉన్న ఓ మిల్లర్ రెండేళ్ల కింద తీసుకున్న వడ్లను పక్కదారి పట్టించడం అసోసియేషన్‌‌లో చర్చనీయాంశంగా మారింది.

అసోసియేషన్‌‌లో కీలక పదవిలో ఉంటూ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రైస్ మిల్లు నిర్వహిస్తున్న సదరు వ్యాపారికి.. 2024–25లో ప్రభుత్వం సుమారు 19 వేల క్వింటాళ్ల ధాన్యం కేటాయించింది. ఈ ధాన్యాన్ని మరాడించి 12,500 క్వింటాళ్ల వరకు సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా.. 6 వేల క్వింటాళ్లు మాత్రమే సదరు వ్యాపారి అప్పగించాడు. మరో 6,500 క్వింటాళ్లు ఇవ్వాల్సి ఉంది. మిల్లులో సుమారు 9,500 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తెలిసింది.

అంతేగాక 2025 వానాకాలంలో మరో 30 వేల క్వింటాళ్ల ధాన్యం అప్పగించగా.. అందులోనూ సగానికిపైగా మాయమైనట్లు సమాచారం. మొత్తంగా 20 వేల క్వింటాళ్లకుపైగా ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. మిల్లర్స్ అసోసియేషన్‌‌లో తన పదవిని అడ్డుపెట్టుకోవడంతోపాటు ఓ ప్రముఖ రాజకీయ నేత తన క్లాస్ మేట్ అంటూ చెబుతుండడంతో అధికారులు సైతం తన మిల్లు వైపు రాకుండా మేనేజ్ చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోస్టు కోసం పావులు కదుపుతుండడం చర్చనీయాంశంగా మారింది.