కరీంనగర్, వెలుగు: ఫైళ్లు మూవ్ చేసేందుకు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన కరీంనగర్ పే అండ్ అకౌంట్స్ జేడీ ఆఫీస్ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్ ను ఏసీబీ ఆఫీసర్లు సోమవారం అరెస్ట్ చేశారు. లంచాల వసూళ్ల కోసం ఈ ఆఫీసర్ ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తీసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
పెండింగ్ లో ఉన్న ఫైళ్లను పరిష్కరించేందుకు, మూవ్ చేసేందుకు ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకోసం ఆయన భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో బినామీ పేరుతో అకౌంట్ ను ఉపయోగించారు.
2022 సెప్టెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు ఈ ఖాతా ద్వారా రూ.14,77,033 లంచాల రూపంలో తీసుకున్నారు. యూపీఐ లావాదేవీల ద్వారా లంచం తీసుకుంటున్నట్లు గుర్తించి సోమవారం ఆయనను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.
