- మూడు నెలల్లో 245 కేసులు, 357 వాహనాలు సీజ్
- ఒక్క మార్చి నెలలోనే 120 కేసులు నమోదు
- ఇసుక దందాకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
- గతంలో ఒక ఎస్సై సస్పెన్షన్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కేసులు నమోదు చేస్తూ ఎక్కడికక్కడ ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారు. గత మూడు నెలల్లో 422 మంది ఇసుక అక్రమ రవాణాదారులపై 245 కేసులు నమోదు చేసిన పోలీసులు.. 357 వాహనాలు సీజ్ చేశారు. ఒక్క మార్చి నెలలోనే 161 మందిపై 120 కేసులు నమోదు చేయడం గమనార్హం. కరీంనగర్ రూరల్ మండలంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇసుక దందాకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. గతంలో ఇదే ఆరోపణలతో ఓ ఎస్సైని సస్పెండ్ చేశారు.
ఇసుక అక్రమ రవాణాపై నిరంతర నిఘా..
ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో మన ఇసుక వాహనం ద్వారా ఇసుక రవాణా జరుగుతోంది. కానీ దీంతో సంబంధం లేకుండా మానేరు, మోయ తుమ్మెద వాగు నుంచి ట్రాక్టర్లలో రాత్రి వేళ ఇసుక రవాణా చేస్తున్నారు. దీంతో పోలీసులు నిఘా పెంచారు. గత మూడు నెలల్లో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 53 కేసులు నమోదు కాగా,73 ట్రాక్టర్లు సీజ్ అయ్యాయి. ఈ కేసుల్లో 85 మందిని నిందితులుగా చేర్చారు. ఆ తర్వాత జమ్మికుంట స్టేషన్ పరిధిలో 71 మందిపై 38 కేసులు నమోదు కాగా 62 ట్రాక్టర్లు సీజ్ చేశారు.
మానకొండూరులో 61 మందిపై 28 కేసులు నమోదు చేసి, 55 ట్రాక్టర్లు సీజ్ చేశారు. వీణవంక పోలీస్ స్టేషన్ పరిధిలో 46 మందిపై 22 కేసులు నమోదు చేసి 40 వెహికల్స్ సీజ్ చేశారు. ఇదిలా ఉండగా గన్నేరువరం మండలం బిక్కవాగు నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా.. మూడు నెలల్లో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఈ మండలంలో ఓ గ్రామ సర్పంచ్ స్వయంగా ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని పోలీసులకు సమాచారమిచ్చినా వారు స్పందించలేదని తెలిసింది.
నకిలీ ఇందిరమ్మ టోకెన్లు ?
ఇసుక అక్రమ రవాణాదారులు మరో అడుగు ముందుకేసి నకిలీ ఇందిరమ్మ టోకెన్లతో ఇసుక తరలిస్తున్నారు. ఇందుకు ఓ పంచాయతీ సెక్రటరీ, కమలాపూర్ కు సంబంధించిన ఓ అధికారి సహకరిస్తున్నట్లు తెలిసింది. జమ్మికుంట మండలానికి చెందిన ఇసుక రవాణా దారులకు ఒక్కో టోకెన్ ను రూ.వెయ్యి చొప్పున అమ్ముకుంటూ యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కొందరు పోలీసుల తీరు మారలే..
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ డ్రైవర్ల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో కొద్ది నెలల క్రితమే కరీంనగర్ సిటీకి సమీపంలోని స్టేషన్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. అయినా కొందరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు తమ పద్ధతి మార్చుకోవడం లేదు. తాజాగా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ కావడం ఆ శాఖలో కలకలం రేపింది. హుజూరాబాద్ కు చెందిన కానిస్టేబుళ్లు రాజిరెడ్డి, శివుడు జమ్మికుంట మండలంలోని నాగంపేట చెక్ పోస్ట్ వద్ద గత 20 రోజులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఇసుక ట్రాక్టర్ కు రూ.200 చొప్పున తీసుకుంటుండగా స్థానికులు వీడియో తీసి పంపడంతో ఎంక్వైరీ చేసి సీపీ వేటు వేశారు.
ఇసుక అక్రమ రవాణ అరికట్టేందుకు ఆరు చెక్‌పోస్టులు
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఊటూరు, కూరపల్లి, సదాశివపల్లి, నాగంపేట, రెడ్డిపల్లిలో పర్మనెంట్ చెక్ పోస్టులు, రేణికుంటలో మొబైల్ చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. గత మూడు నెలల్లో 422 మందిపై 245 కేసులు నమోదు చేశాం. రిపీటెడ్ గా ఇసుక అక్రమ రవాణా చేస్తూ చిక్కిన 8 మందిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడంతోపాటు బైండోవర్ కూడా చేస్తున్నాం. వారికి ఎక్కువ ఫైన్ వేసేందుకు మైనింగ్, ఆర్టీఏ ఆఫీసర్లకు రాస్తున్నాం.- గౌష్ ఆలం, సీపీ, కరీంనగర్
