- వేర్వేరు టీమ్‌లతో జైలు నుంచే ఆపరేట్ చేసిన గోల్డెన్ థీఫ్ సుబోధ్
- ఒక టీమ్‌తో మరొక టీమ్‌కు సంబంధం లేకుండా ఆపరేషన్
- ఒకరి ఆచూకీ మరొకరికి తెలియకుండా ప్లాన్
- పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటనలో ఇద్దరు దొంగలతోపాటు సహకరించిన వ్యక్తి అరెస్టు
- ఇంకా రికవరీ కాని బంగారం, పిస్టల్స్
- వివరాలు వెల్లడించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీలో ఈ నెల 3న జరిగిన బంగారం, వజ్రాల దోపిడీ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బిహార్ జైలులో ఉన్న అంతర్రాష్ట్ర హ్యాండ్లర్, ది గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ ఈ దోపిడీకి స్కెచ్ వేసినట్టు పోలీసులు కనుగొన్నారు. దోపిడీకి ప్లాన్ వేసింది, సిమ్ లు ఇచ్చింది, బైక్స్, పిస్టల్స్ అరెంజ్ చేసింది, దోపిడీకి పాల్పడింది, చివరికి బంగారం రిసీవ్ చేసుకుంది వేర్వేరు టీమ్ లు అని ఎంక్వైరీలో తేలింది.
ఒక టీమ్ ను మరొక టీమ్ మారుపేర్లతో కలుసుకోవడంతో ఒకరి వివరాలు మరొకరికి తెలియకుండాపోయాయి. దీంతో దోపిడీలో భాగస్వాములైన అందరిని అరెస్టు చేయడం పోలీసులకు సవాల్ గా మారింది. 10 రోజులపాటు శ్రమించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు దొంగలతోపాటు ఈ ముఠాకు సిమ్ లు సప్లై చేసిన వ్యక్తిని మాత్రమే అరెస్టు చేయగలిగారు. దోపిడీ వివరాలను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం గురువారం మీడియాకు వెల్లడించారు.
- సినిమాను తలపించేలా దోపిడీ..
దోపిడీలో పాల్గొన్న మెజార్టీ సభ్యులు పోలీసులకు చిక్కకుండా సుబోధ్ సింగ్ రాబరీకి ప్లాన్ చేశాడు. అతడి ప్లాన్ ప్రకారం రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్, రవీశ్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్, రాధే అలియాస్ అభయ్ అలియాస్ ప్రమోద్ గోస్వామి, మిశ్రా, సూర్యమణి కుమార్ అలియాస్ సనోజ్ రెండు నెలల కిందటే తెలంగాణకు చేరుకున్నారు. వచ్చే ముందు వారు ఝార్ఖండ్,- బెంగాల్ సరిహద్దులో మెహతాబ్ ఖాన్ వద్ద ఒక్కో సిమ్ కార్డును రూ.10 వేల చొప్పున కొనుగోలు చేశారు.
వారు పెద్దపల్లికి చేరుకునేసరికి వారి కోసం గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైక్ లను సిద్ధం చేశారు. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ జ్యువెలరీ షాపులు, బ్యాంకులపై రెక్కీ నిర్వహించారు. చివరకు కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాప్‌ను టార్గెట్ గా చేసుకుని పెద్దపల్లిలోని ఒక లాడ్జ్‌లో కొద్ది రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఈ నెల 1న ధర్మపురిలోని విజయలక్ష్మి గెస్ట్ హౌస్‌కు మారి దోపిడీకి సిద్ధమయ్యారు.
- చంద్రపూర్‌లో పిస్టల్స్..
టీమ్ కు లీడర్ గా ఉన్న రఘునాథ్ కర్మాకర్ ఈ నెల 1న మంచిర్యాలకు వెళ్లి రైలులో చంద్రపూర్ సమీపానికి చేరుకున్నాడు. గడ్‌చందూర్ పరిసరాల్లో అతడికి ఈ నెల 2న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆరు పిస్టల్స్, మ్యాగజైన్లు అందజేశారు. అనంతరం రఘునాథ్ కర్మాకర్ ఆయుధాలతో ధర్మపురికి చేరుకున్నాడు. ఈ నెల 3న ఉదయం ఐదుగురు ధర్మపురిలో వారు ఉన్న లాడ్జ్ ను ఖాళీ చేసి రెండు బైక్‌ల పై బయల్దేరారు. బ్యాగులను కొండ ప్రాంతంలో దాచిపెట్టి అక్కడే బైక్ నంబర్ ప్లేట్లు మార్చారు.
వెలిచాల క్రాస్ రోడ్ వద్ద టిఫిన్ చేసి తమ ప్లాన్ గురించి మరోసారి చర్చించారు. ఉదయం 10:50 గంటలకు పీఎంజే జ్యువెలరీ షాప్‌కు చేరుకున్నారు. ప్లాన్ ప్రకారం మొదట రాధే కస్టమర్ లాగా షాప్‌లోకి వెళ్లి పరిస్థితిని గమనించాడు. రాధే మెస్సేజ్ ఇచ్చిన తర్వాత మిగతా నిందితులు లోపలికి ప్రవేశించి సిబ్బందిని ఆయుధాలతో బెదిరించారు. నగలు దోచుకుంటుండగా స్టాఫ్ ప్రతిఘటించడంతో దొంగలు పిస్టల్స్ తో కాల్పులు జరిపారు. పారిపోతూ వారు షాపులో దోచుకున్న ఒక ఆభరణాల బ్యాగ్‌ను ఎత్తుకెళ్లి .. మరో బ్యాగ్‌ను షాప్‌లోనే వదిలేశారు.
- త్వరలో పీటీ వారెంట్‌పై కరీంనగర్‌కు సుబోధ్ సింగ్
గ్యాంగ్ లీడర్ సుభోద్ సింగ్ జైలులో ఉండగా.. దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న రాధే, మిశ్రా, సూర్యమణి కుమార్ పరారీలో ఉన్నట్టు సీపీ తెలిపారు. అలాగే, లాజిస్టిక్ ఏర్పాట్లు చేసిన వ్యక్తి, ఈ ఆపరేషన్ కోఆర్డినేటర్, దోపిడీకి డబ్బు సమకూర్చిన వ్యక్తి, రెక్కీ నిర్వహించిన వ్యక్తి, క్రెటా కారు డ్రైవర్, గ్యాంగ్ మెంబర్ ను గుర్తించాల్సి ఉందని సీపీ వెల్లడించారు. మిగిలిన నిందితులు, దోచుకెళ్లిన ఆభరణాల కోసం ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. బిహార్ రాష్ట్రంలోని పూర్ణియా సెంట్రల్ జైలులో ఉన్న సుబోధ్ సింగ్ ను త్వరలో పీటీ వారెంట్ పై కరీంనగర్ కు తీసుకొచ్చి విచారించనున్నట్టు సీపీ వెల్లడించారు.
- గోదావరి నదిని ఈది మంచిర్యాలకు..
ముందుగా అనుకున్న ప్రకారం రాబరీ ముగియగానే రెండు బైక్‌లపై కెనాల్, గ్రామీణ రోడ్ల వెంట ధర్మపురికి చేరుకున్నారు. సనోజ్, రాధే, ప్రద్యుమన్ గోదావరి నది ఒడ్డున పల్సర్ బైక్‌ను వదిలేసి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లారు. తర్వాత, గోదావరిలో ఈదుకుంటూ నదిని దాటి మంచిర్యాల నుంచి రైలులో పరారయ్యారు. రఘునాథ్ కర్మాకర్, మిశ్రా బంగారం, వజ్రాల బ్యాగ్‌తో అపాచీ బైక్‌పై గుండాల అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ క్రెటా కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులకు ఆభరణాల బ్యాగ్, బైక్, పిస్టల్స్ అప్పగించి సమీప రైల్వే స్టేషన్ ద్వారా బిహార్‌కు పారిపోయారు.
వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఇప్పటివరకు 13 మంది నిందితులను గుర్తించాయి. కరీంనగర్లో దోపిడీ చేసిన టీమ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ (బెంగాల్), రావిశ్ కుమార్ (బిహార్)తో పాటు సిమ్ కార్డులు ఇచ్చిన మెహతాబ్ ఖాన్ (బెంగాల్)ను అరెస్టు చేశారు. వారి వద్ద ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులు, రూ.51 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపర్చారు. రఘునాథ్ కర్మాకర్‌పై వివిధ రాష్ట్రాల్లో దోపిడీ, హత్య, ఆయుధ చట్టాల కింద 7 కేసులు, రావిశ్ కుమార్ 15 కేసులు ఉన్నట్టు తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఓ సోషల్ మీడియా యాప్ ద్వారా మాట్లాడుకుంటూ కోఆర్డినేట్ చేసుకున్నట్టు సీపీ తెలిపారు.
