ఆన్ లైన్ పాటల పోటీల్లో బెస్ట్ సింగర్ గా కరీంనగర్ సాయి అక్షిత

ఆన్ లైన్ పాటల పోటీల్లో బెస్ట్ సింగర్ గా కరీంనగర్ సాయి అక్షిత

75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మహారాష్ట్రలోని వర్ధాకు చెందిన బజాజ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో  నిర్వహించిన ఆజాద్ కా అమృత మహోత్సవ్  జాతీయస్థాయి ఆన్ లైన్ పాటల పోటీల్లో బెస్ట్ సింగర్ గా నిలిచింది కరీంనగర్ కు చెందిన సాయి అక్షిత. పలు రాష్ట్రాలకు చెందిన గాయనీ గాయకులు ఇందులో పాల్గొన్నారు. పోటీల్లో సత్తాచాటి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అక్షిత.
 
మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తోన్న శైలేష్ బాబు, ప్రయివేటు టీచర్ గా పనిచేస్తున్న లావణ్యల ఏకైక కూతురై సాయి అక్షితకు చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఇష్టం. అమ్మమ్మ విజయ ప్రోత్సాహంతో ఐదేళ్ల వయస్సునుంచే సంగీత సాధన ప్రారంభించింది. శైలేష్, లావణ్య వాళ్లది మంచిర్యాల జిల్లా చెన్నూరు కాగా..  కరీంనగర్ లో స్థిరపడ్డారు. మొదట్లో కీ బోర్డు ప్లేయర్ గా శిక్షణ తీసుకుంది అక్షిత.కరీంనగర్ కు చెందిన సంగీత మాస్టార్ కె.బి. శర్మ.. తనలోని గాయకురాలిని గుర్తించి.. పాటలు పాడటం వైపు ప్రోత్సహించారని చెబుతోంది అక్షిత.
 
మొదట్లో లైట్ మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంది సాయి అక్షిత. ఇప్పుడు కర్ణాటక సంగీతంలో తర్ఫీదు పొందుతోంది. ఇప్పటికే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక సంగీతంలో సర్టిఫికెట్ కోర్సుపూర్తి చేసింది. ప్ర్రస్తుతం డిప్లమో చేస్తోంది. ఇటు ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తి చేసి ఈ ఏడాది బిటెక్ లో చేరబోతోంది. మ్యూజిక్ లో ఎంఎ చేసి తనలాంటి వారికి మ్యూజిక్ నేర్పాలన్నది లక్ష్యమని చెబుతోంది అక్షిత. అప్పుడప్పుడు సినీ గీతాలనూ ప్రాక్టీస్ చేసే అక్షిత ... ఇంతకుముందు అనేక కాంపిటీషన్లలో పాల్గొని బహుమతులు అందుకుంది. కర్ణాటక సంగీతంలో ఉన్నత స్థానానికి చేరాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది.  త్యాగరాజ కృతులు, ముత్తుస్వామి దీక్షితుల, శ్యామశాస్త్రి కృతులు, అన్నమాచార్య, నారాయణ తీర్థులు, విజయదాసు, రామదాసు, సదాశివ బ్రహ్మేంద్ర, ఊటుకూరి వెంకటకవి కృతులను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నానని చెబుతోంది. 

కరీంనగర్ కు చెందిన సంగీత గురువు పద్మాసని  దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకుంటూనే మరోవైపు వరుణి అనే టీచర్ ద్వారా  బెంగళూరు నుంచి ఆన్ లైన్ లో అడ్వాన్సుడు సంగీత శిక్షణ పొందుతోంది అక్షిత.కొండగట్టులో  కచేరీలు, అన్నమాచార్య జయంత్యుత్సావల్లో  పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షిత తల్లి లావణ్య కూడా అద్భతంగా పాడుతారు. తల్లీ కూతుళ్లు కలిసి కూడా కొన్ని చోట్ల కచేరీలు చేశారు.  గతంలో  జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులు సాధించడంతో పాటు, బాలగంధర్వం అనే టీవీ షోలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది అక్షిత. చదువులో ఒత్తిడికి గురైనప్పుడు సంగీత సాధన చేస్తానని చెబుతోంది.
 
పాటలతో పాటు చిత్రలేఖనం, డ్యాన్స్ కూడా అక్షిత నేర్చుకుందంటున్నారు కుటుంబ సభ్యులు. అయితే  సంగీతం పైనే పూర్తి ఫోకస్ పెట్టిందంటున్నారు. కవితలు కూడా రాస్తుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బెస్ట్ సింగర్ గా అవార్డు రావడం ఆనందంగా ఉందంటున్నారు కుటుంబ సభ్యులు.