కరీంనగర్: తమ కొడుకు మరణానికి హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంటే కారణమంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు మృతుడి తల్లిదండ్రులు. వివరాలు.. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేసే ప్రవీణ్ అనే ఉద్యోగి(టీఆర్ఎస్వీ నేత కూడా) మంగళవారం రాత్రి గుండెపోటుతో చనిపోయాడు. అయితే అతని మృతికి ఆసుపత్రి సూపరింటెండెంట్ కారణం అంటూ అతని బంధువులు బుధవారం ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రవీణ్ ను.. ఆసుపత్రి సూపరింటెండెంట్ అతనితో తప్పుడు రికార్డులు రాయించేందుకు ప్రయత్నించాడని సమాచారం. ప్రవీణ్ అందుకు ఒప్పుకోకపోవడంతో కొద్ది రోజుల క్రితం అతనిపై తప్పుడు కేసులు పెట్టించి.. సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్.. తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లి అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్నా… తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంపై మనస్తాపం చెంది మరణించాడని అంటున్నారు.
సూపరింటెండెంట్ పై కేసు నమోదు చేసేదాకా శవాన్ని తీసి లేదంటూ ప్రవీణ్ బంధువులతో పాటు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ఆందోళన చేపట్టారు. trsv రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా అక్కడికి హాజరయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మృతదేహాన్ని వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల కు తరలించారు.
