కరీంనగర్ సిటీ షాక్ అయ్యింది. మొన్నటికి మొన్న .. 4 రోజుల క్రితం కరీంనగర్ 2వ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోనే.. ఇప్పుడు భర్త, ఎస్సై చంద్రశేఖర్ సైతం ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల్లోనే SI, అతని భార్య ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
2026, మార్చి 21వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు ఎస్సై చంద్రశేఖర్. భార్య దివ్య ఆత్మహత్య తర్వాత.. అత్తగారి ఇంటి దగ్గరే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సందర్భంలో గ్రామస్తులు, బంధువులు ఎస్సై చంద్రశేఖర్ పై దాడికి ప్రయత్నించారు. దివ్య మరణానికి భర్తనే కారణమని ఆరోపించారు. ఆ సందర్భంగా దివ్య తల్లిదండ్రులే అల్లుడు ఎస్సై చంద్రశేఖర్ ను కాపాడారు. అప్పటి నుంచి చంద్రశేఖర్ తీవ్ర మనోవేదనతో ఉన్నాడు.
నాలుగు రోజులుగా తీవ్ర మనోవేదనతో ఉన్న ఎస్సై చంద్రశేఖర్.. భార్య దివ్య ఐదో రోజు కార్యక్రమానికి అత్తగారి ఊరు అయిన ఇల్లందుకుంట మండలం సీతంపేట గ్రామానికి వచ్చాడు. అత్తగారి ఇంట్లోనే కార్యక్రమానికి వచ్చిన ఎస్సై చంద్రశేఖర్.. ఓ గదిలోకి వెళ్లి.. ఎంత సేపటికీ బయటకు రాలేదు. దివ్య పేరంట్స్, బంధువులు గదిలోకి వెళ్లిచూడగా.. ఉరి వేసుకుని కనిపించాడు.
ఆ వెంటనే చంద్రశేఖర్ ను జిమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. భార్య దివ్య ఆత్మహత్య.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు చంద్రశేఖర్. భార్య ఆత్మహత్యను జీర్ణించుకోలేకుండా ఉండటం.. తీవ్ర మానసిక క్షోభతో అత్తగారి ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు చంద్రశేఖర్.
