- నిందితుల్లో హెడ్ కానిస్టేబుల్‌తో పాటు రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో వెలుగు చూసిన రూ.1.40 కోట్ల జీతాల స్కామ్‌లో హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఇతడికి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైవీ.మునిరామయ్య, వాచ్‌మన్ లావుడ్యా రవి, డ్రైవర్ చుక్కా గంగరాజు, మటన్ షాప్‌కీప్ శంకర్ నామతాబాబ్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. జీతాల చెల్లింపుల్లో అనుమానాస్పద లావాదేవీలను గమనించిన సీపీ గౌష్ ఆలం విచారణ చేపట్టాలని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్‌ను ఆదేశించారు.
ఈ క్రమంలోనే గతంలో సీపీఓ ఆఫీస్ పే సెక్షన్‌లో పనిచేసి, ప్రస్తుతం చిగురుమామిడిలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నీలం రామ్మోహన్ వ్యవహారం వెలుగుచూసింది. ఆయన పే సెక్షన్‌లో చేస్తున్నప్పుడు చనిపోయిన కానిస్టేబుళ్లు సీహెచ్. రవీందర్, కె. గంగస్వామి, కె. రవి ఎంప్లాయ్ ఐడీలతో లావుడ్యా రవి, గంగరాజు, శంకర్ నామతాబాబ్ పేర్లను చేర్చి ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేశాడు. వీరి పేరుతో కరీంనగర్ భగత్‌నగర్, బొమ్మకల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌లలో అకౌంట్లు ఓపెన్ చేసి వాటికి తన మొబైల్ లింక్ చేశాడు. తర్వాత జీతాలు ఆయా అకౌంట్లలో డిపాజిట్ అయ్యేలా ప్లాన్ చేశాడు. ఇలా జూన్ 2022 నుంచి మార్చి 2026 వరకు మొత్తం రూ. 1,40,18,308 జమ అయ్యాయి.
ఈ ఖాతాలతోనే హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ లోన్లు తీసుకొని, ఆ అకౌంట్ల నుంచే ఈఎంఐలు కట్ అయ్యేలా చూసుకున్నాడు. ఈఎంఐలు పోను మిగతా డబ్బులను తన అకౌంట్లకు మళ్లించుకునేవాడు. రామ్మోహన్ అక్రమాలకు సీపీ ఆఫీస్‌లో పనిచేసి రిటైర్డ్ అయిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైవీ ముని రామయ్య సైతం సహకరించినట్లు తేలింది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీష్ ఫిర్యాదుతో కరీంనగర్ వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. నీలం రామ్మోహన్‌తో పాటు మునిరామయ్య, లావుడ్యా రవి, చుక్కా గంగరాజు, శంకర్ నామతాబాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్మోహన్ నుంచి 341.1 గ్రాముల బంగారం, రూ.50 వేలు, మునిరామయ్య నుంచి మొబైల్, ప్రభుత్వ సిమ్ కార్డు, రూ.18 వేలు స్వాధీనం చేసుకున్నారు.
