బోనాల ఊరేగింపులో కర్నాటక ఏనుగు .. ఫలించిన మంత్రి కొండా సురేఖ ప్రయత్నం

బోనాల ఊరేగింపులో కర్నాటక ఏనుగు .. ఫలించిన మంత్రి కొండా సురేఖ ప్రయత్నం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపుతో పాటు మొహర్రం పండుగ(బీబీ కా ఆలం అంబారీ ఊరేగింపు) నిమిత్తం తెలంగాణకు ఏనుగు(రూపవతి)ను తరలించేందుకు కర్నాటక అటవీ శాఖ ఆమోదం తెలిపింది. మంత్రి కొండా సురేఖ కర్నాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో చర్చించి, ఏనుగు తరలింపుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

దీంతో కర్నాటక దావణగిరెలోని పాంచాచార్య మందిర ట్రస్టు నుంచి ఏనుగు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైందని మంత్రి  బుధవారం ఓ పత్రిక ప్రకటనలో వెల్లడించారు. ఏనుగు తరలింపులో అటవీ చట్టాలను, జాగ్రత్తలను, అన్ని రకాల మార్గదర్శకాలను అనుసరిస్తామని కొండా సురేఖ తెలిపారు. ఏనుగు పోషణ, విశ్రాంతి తదితర అంశాలను తప్పకుండా  పాటించాల్సిందిగా రాష్ట్ర అటవీ అధికారులను మంత్రి ఆదేశించారు.