పెండ్లికి మందు, దావత్ లు ఇయ్యొద్దు

పెండ్లికి మందు, దావత్ లు ఇయ్యొద్దు
  • పిల్లలు, ముసలోళ్లు రావొద్దు
  • ఫంక్షన్లపై క‌ర్ణాట‌క‌ సర్కారు గైడ్ లైన్స్

బెంగళూరు: ‘‘పెండ్లి చేసుకుంటే 50 మంది కంటే ఎక్కువ గెస్టులను పిలవొద్దు. అక్షింతలేయనింకె వచ్చిన చుట్టాలు, దోస్తులకు మందు దావత్ ఇయ్యొద్దు. మ్యారేజీకొచ్చే ప్రతి ఒక్కరూ తమ ఫోన్ లో ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసుకోవాలి..” అని క‌ర్ణాట‌క‌ సర్కారు పెండ్లికి కొత్త రూల్స్ తెచ్చింది. ఇతర విందులు, వినోదాలపైనా ఆంక్షలు పెడుతూ తాజా గైడ్ లైన్స్ ను జారీ చేసింది. సోమవారం నుంచి అమలులోకి వచ్చే నాలుగో విడత లాక్ డౌన్ టైంలో ఈ గైడ్ లైన్స్ అమలులోకి వస్తున్నాయి. పెళ్లిళ్లు మాత్రమే కాకుండా, ఇతర ఏ ప్రైవేట్ ఫంక్షన్ కు అయినా ఇవే రూల్స్ వర్తిస్తాయని రాష్ట్ర హోం శాఖ స్పష్టం చేసింది.

మే 17 తర్వాత జరిగే ఏ ఫంక్షన్ లోనైనా గెస్టుల వివరాలు నమోదు చేయాలని, ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అందించొద్దని హెచ్చరించింది. అన్ని ఫంక్షన్లలో హ్యాండ్ శానిటైజర్లు, ఫేస్ మాస్కులు కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. కంటైన్ మెంట్ జోన్ కు చెందినవారిని మాత్రం ఎలాంటి ఫంక్షన్లకూ అనుమతించబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అలాగే 65 ఏళ్లకు పైబడినవారు, 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులూ పెళ్లిళ్లు, లేదా ఇతర ఏ ఫంక్షన్ కూ వెళ్లరాదని స్పష్టం చేసింది. అయితే, పెళ్లిళ్లకు 50 మందికి మించి రాకూడదని, ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకారాదని కేంద్ర హోం శాఖ ఇదివరకే గైడ్ లైన్స్ విడుదల చేసింది.