కాంగ్రెస్​తో కలిసిన కామ్రేడ్లు.. హస్తం పార్టీ అభ్యర్థుల ప్రచారంలో సీపీఐ నేతలు

కాంగ్రెస్​తో కలిసిన కామ్రేడ్లు.. హస్తం పార్టీ అభ్యర్థుల ప్రచారంలో సీపీఐ నేతలు
  • భువనగిరిలో పల్లా వెంకట్​ రెడ్డి, మల్కాజ్​గిరిలో చాడ వెంకట్​ రెడ్డి
  • త్వరలో ఎమ్మెల్యే కూనంనేనితో పాటు ఇతర నేతలూ అటెండ్
  • ఇటీవల సీపీఐ నేతలతో చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం భట్టి
  • కాంగ్రెస్​కు మద్దతిస్తున్నట్లు సీపీఎం ప్రకటన

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​తో కామ్రేడ్లు కలిశారు.  సీపీఐ నేతలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల సీపీఐ , సీపీఎం నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఆదివారం భువనగిరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి  పాల్గొనగా, సీపీఐ నుంచి ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్​రెడ్డి హాజరయ్యారు. తాజాగా మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో భాగంగా మేడ్చల్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్​రెడ్డి పాల్గొన్నారు. సభా వేదికపై సీఎం రేవంత్​రెడ్డి తన పక్కనే చాడకు చోటిచ్చారు.  ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో సీపీఐ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొననున్నారు.

భువనగిరి లో పోటీ నుంచి తప్పుకున్న సీపీఎం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. భువనగిరిలో పోటీ విరమించుకోవాలని సీఎం కోరగా,  సీపీఎం నేతలు అంగీకరించారు. పార్టీ జాతీయ నేతలతో చర్చించి, త్వరలో తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కాగా, త్వరలో సీపీఎం నేతలు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. 

కాంగ్రెస్ కు కలిసిరానున్న ఓటు బ్యాంకు

రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సీపీఐ, సీపీఎం పార్టీలకు ఓటు బ్యాంక్​తోపాటు కేడర్​ ఉంది. సింగరేణి ప్రాంతంలో ఏఐటీయూసీ, సీపీఎం అనుబంధ సంస్థ యూనియన్లకు బలమైన కేడర్​ ఓట్లు ఉన్నాయి. వీటికితోడు ఈ రెండు పార్టీల అనుబంధ ట్రేడ్ యూనియన్లు, రాష్ట్రంలో పలు ఎంఎన్ సీ కంపెనీల్లో గుర్తింపు సంఘాలుగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల ఓట్లు తమ అభ్యర్థుల గెలుపునకు కలిసివస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.