హామీలన్నీ అమలు చేస్తే.. నేనూ రిజైన్​ చేస్తా : మహేశ్వర్​ రెడ్డి

హామీలన్నీ అమలు చేస్తే.. నేనూ రిజైన్​ చేస్తా : మహేశ్వర్​ రెడ్డి
  • ఖాళీ లెటర్ ​హెడ్​ను గాంధీ భవన్​కే పంపిస్తా
  • చేయలేకపోతే రేవంత్​ కూడా రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలి
  • గ్యారంటీలను అమలుచేయకుండా కాంగ్రెస్, బీఆర్​ఎస్ మ్యాచ్ ​ఫిక్స్
  • రాజ్యాంగ సవరణలు ఎక్కువసార్లు చేసింది కాంగ్రెస్​ పార్టేనని కామెంట్

హైదరాబాద్, వెలుగు: ఆగస్టు 15లోపు రుణమాఫీతో పాటు సీఎం రేవంత్​ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే.. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్​ రెడ్డి సవాల్​ చేశారు. తన ఖాళీ లెటర్​ హెడ్​ను గాంధీ భవన్​కే పంపిస్తానని, స్పీకర్​ ఫార్మాట్​లో మీరే రాజీనామా లేఖ టైప్​ చేయించాలని సూచించారు. ఒకవేళ హామీలు అమలు చేయకపోతే రేవంత్​ రెడ్డి కూడా రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.

 రైతు రుణమాఫీ పేరుతో మిగతా హామీలను కూడా అమలు చేయకుండా కాంగ్రెస్, బీఆర్​ఎస్​ నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. ఆ రెండు​ పార్టీల మ్యాచ్​ఫిక్సింగ్​ మరోసారి బయటపడిందన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీల అమలుపై తాము మొదటి నుంచీ ప్రశ్నిస్తున్నామని, ఇటీవల సీఎంకు లేఖ కూడా రాశానని గుర్తుచేశారు. దానికి సమాధానం చెప్పకుండా సబ్జెక్ట్​ను పక్కదారి పట్టించేందుకు రేవంత్​ రెడ్డి, హరీశ్​రావు మ్యాచ్​ఫిక్స్​ చేసుకున్నారని ఆరోపించారు.

 అందుకే మిగతా హామీలను పక్కనపెట్టి కేవలం రుణమాఫీపైనే ప్రశ్నిస్తూ హరీశ్​ రావు రాజీనామా డ్రామాకు తెరతీశారన్నారు. రుణమాఫీ చేయలేకపోతే అధికారం ఎందుకని అంటున్న రేవంత్  రెడ్డి.. వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేయనప్పుడు మాత్రం ఆ అధికారం ఎందుకని మహేశ్వర్​ రెడ్డి ప్రశ్నించారు. వంద రోజుల పాలనకు లోక్​సభ ఎన్నికలు రెఫరెండంగా చెప్పుకుంటున్న సీఎం.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్లకు రేషియోలో ఎంపీ సీట్లూ గెలవాలని సవాల్​ చేశారు. 

రిజర్వేషన్లపై రేవంత్ రాజకీయ డ్రామాలు

రిజర్వేషన్లపై సీఎం రేవంత్​రెడ్డి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్​ రెడ్డి విమర్శించారు. గతంలో కాంగ్రెస్​ చేసిన తప్పుల వల్లే బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు లబ్ధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ముస్లింల కోసమే ప్రాయాస పడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎక్కువ సార్లు రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్​పార్టేనన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలని మహేశ్వర్​రెడ్డి సూచించారు. బీజేపీ.. ఎకనమికల్ బ్యాక్​వర్డ్​క్లాస్​ వాళ్ల కోసమే రాజ్యాంగ సవరణ చేసిందని, దానికి అన్ని పార్టీలూ సపోర్ట్​ చేశాయని ఆయన గుర్తుచేశారు.