
ఆమనగల్లు, వెలుగు: కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి మండలం పోలెపల్లి గ్రామానికి చెందిన కుమిబాయికి సోమవారం రాత్రి పోలీసుల సహకారంతో మాడుగుల మండల కేంద్రానికి చెందిన మహిళలు పురుడు పోశారు. సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగుల రైతు వేదిక వద్ద ఇద్దరు పిల్లలతో గుర్తు తెలియని మహిళ ఉందని డయల్ 100కు సమాచారం వచ్చింది. వెంటనే పెట్రోలింగ్ కానిస్టేబుల్ రాజేందర్, హోంగార్డు సురేశ్ అక్కడికి చేరుకోగా.. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతోంది. వెంటనే స్పందించిన వారు గ్రామ మహిళల సహకారంతో ఆమెకు పురుడు పోయగా, సుఖ ప్రసవం జరిగి మగ శిశువుకు జన్మనిచ్చింది.
అనంతరం విచారించగా.. గత నెల 29న కొడుకు గణేశ్, కూతురు గీతతో కలిసి మానసిక పరిస్థితి లేక ఇంటి నుంచి వచ్చేసింది. దీనిపై ఆమె భర్త గిరీశ్ చించోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. విషయాన్ని హైదరాబాద్ లో ఉంటున్న కుమిబాయి సోదరుడు రాహుల్ కు సమాచారం అందించి.. పిల్లలతో ఆమెను 108 అంబులెన్స్ లో కోటి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.