కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష కాంబినేషన్‌లో రూపొందిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'కరుప్పు'( వీరభద్రుడు ) విడుదలకు ముందే పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. 32 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాకు తొలిరోజే ఊహించని షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య గురువారం (మే 14) విడుదల కావాల్సిన ఈ సినిమా మార్నింగ్ షోలు ప్రపంచవ్యాప్తంగా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
అసలేం జరిగింది?
తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఈ సినిమాకు స్పెషల్ పర్మిషన్ ఇస్తూ ఉదయం 9 గంటల షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా గత కొన్నేళ్లుగా తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం విజయ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ, సీన్ కట్ చేస్తే.. షోకు కొన్ని గంటల ముందే నిర్మాత ఎస్.ఆర్. ప్రభు అనివార్య కారణాల వల్ల ఉదయం 9 గంటల షోలు రద్దు చేస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు. తదుపరి షో ఎప్పుడు అనేదానిపై నిర్మాత క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Due to unavoidable reasons 9am shows will be cancelled for Karuppu. Our sincere apologies to everyone!
— SR Prabu (@prabhu_sr) May 13, 2026
దర్శకుడు ఏమన్నారంటే?
సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో దర్శకుడు ఆర్.జె. బాలాజీ భావోద్వేగపూరితమైన ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాకు అడుగడుగునా అడ్డంకులే. 32 నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడి వరకు వచ్చాం. నిర్మాతలకు కూడా ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత లేదు. వారు సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నారు. దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఈ అడ్డంకిని కూడా దాటుతాం అని పేర్కొన్నారు.
Dearest fans, I dont have a concrete answer to the current situation. Producers are doing their best to solve the hurdles. This film has always had hurdles, and somehow God has made us sail through all that and here we are after 32 months. This time as well, I have faith,…
— RJ Balaji (@RJ_Balaji) May 13, 2026
పాత బకాయిలే కారణమా?
అయితే ఈ సినిమా షో రద్దుకు నిర్మాత పాత బకాయిలే సమస్యలకు కారణమని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఫైనాస్సియర్లకు తిరిగి చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో క్లియర్ చేయకపోవడం వల్లే ఈ చిత్రం విడుదల నిలిచిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఆర్థిక సమస్యలపై ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయని , సమస్యలు పరిష్కారమైతే తదుపరి షోలు ప్రారంభమవుతాయని పేర్కొంటున్నారు.
ఫ్యాన్స్ ఆగ్రహం..
షోలు రద్దు కావడంతో సూర్య అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఎమోషన్స్‌తో ఆడుకోకండి, వీలైతే రేపటికి వాయిదా వేయండి అని కొందరు.. కేరళలో కూడా షోలు రద్దు అయ్యాయా? క్లారిటీ ఇవ్వండి అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలా చేయడం సరికాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Please postpone the release for tomorrow and plan it properly..kindly don't play with fans effing emotions,bro
— Rohith Nair (@Rohith_nair19) May 14, 2026
ఆర్.జే. బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ పవర్‌ఫుల్ చిత్రంలో సూర్య, త్రిషలతో పాటు ఇంద్రన్స్, నట్టి, శివద కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎసెట్. ప్రస్తుతం తమిళనాడులో రోజుకు ఐదు షోలకు అనుమతి ఉన్నప్పటికీ, ఈ ఉదయం షోల రద్దు ఎఫెక్ట్ కలెక్షన్లపై పడే అవకాశం ఉంది. మొత్తానికి 'కరుప్పు' ప్రయాణం సినిమా కన్నా ఎక్కువ డ్రామాతో సాగుతోంది. మరి మధ్యాహ్నం షోలకైనా లైన్ క్లియర్ అవుతుందో లేదో చూడాలి..
