కాంగ్రెస్ లో చేరిన కాసర్ల రాజు...కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ వంశీకృష్ణ

కాంగ్రెస్ లో చేరిన  కాసర్ల రాజు...కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లిలో ఎంపీ వంశీకృష్ణ చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పెద్ద సంఖ్యలో యువత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది. సోమవారం ఢిల్లీలోని ఎంపీ అధికారిక నివాసం(కాక హౌజ్)లో పెద్దపల్లి పట్టణానికి చెందిన శ్రీ మాత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాసర్ల రాజు కాంగ్రెస్ లో చేరారు. కాసర్ల రాజుతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కాసర్ల రాజు కృషి చేయాలని సూచించారు. 

తాజా చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. పార్టీలోకి ఆహ్వానించినందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాసర్ల రాజు కృతజ్ఞతలు తెలిపారు. కాసర్ల రాజుతో పాటు కోట మల్లేశ్, బొడ్డు సుమన్, బొడ్డుపల్లి రవి, బండ రాజయ్య, వేల్పుల రమేశ్, ఓ.శ్రీధర్, సంపత్, సురేశ్, శ్రీనివాస్, మల్లేశ్, సతీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

ఓదెల రైల్వే స్టేషన్​లో  పలు రైళ్ల హాల్టింగ్​కు కృషి చేస్త 

ప్రజల విజ్ఞప్తులు, ప్రయాణీకుల సౌకర్యార్థం ఓదేల రైల్వే స్టేషన్ లో పలు రైళ్లకు హాల్టింగ్ ఇచ్చేలా కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కరీంనగర్–తిరుపతి, అండమాన్ రైళ్లను ఓదెల రైల్వే స్టేషన్ లో ఆగేలా చొరవ చూపాలని పలువురు ఢిల్లీలో ఆయన్ను కలిసి వినతులు సమర్పించారు. అలాగే పొత్కపల్లి–కొలనూరు రైల్వే స్టేషన్ లో అజ్నీ రైలు హాల్టింగ్ ఇవ్వడంతోపాటు ఈ రైలును సికింద్రాబాద్ వరకు పొడగించేలా సహకరించాలని కోరారు. 

దీనిపై స్పందించిన ఎంపీ.. ఈ సెషన్ లోనే ఈ రైళ్ల హాల్టింగ్, సికింద్రాబాద్ వరకు ట్రైన్ పొడగింపు అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కూడా స్వయంగా కలిసి అన్ని అంశాలు వివరిస్తానని భరోసా ఇచ్చారు.

బీజేపీకి రాహుల్ భయం పట్టుకుంది

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భయం పట్టుకుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అందుకే రాహుల్ గాంధీ సభలో మాట్లాడేందుకు సిద్ధం కాగానే.. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా సభను వాయిదా వేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనంతో నడుస్తున్న సభను వాయిదాలతో వృథా చేసే అధికారం  అధికార పార్టీకి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. 

ఇటీవల సస్పెండ్ అయిన ఎంపీలు సోమవారం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కొనసాగించారు.  ‘‘మీరు మమ్మల్ని సస్పెండ్ చేయొచ్చు.. కానీ, మీరు మా నోరు నొక్కలేరు(యూ కెన్ సస్పెండ్ అస్, బట్ కాంట్ సైలెన్స్ అస్)’ అనే ఫ్లెక్సీతో కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 

ఈ ఆందోళనకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేవలం ఒక నిర్దిష్ట విషయంపై మాత్రమే మాట్లాడితే అనుమతిస్తానని స్పీకర్ అంటున్నారు. అంటే, రాహుల్ గాంధీ ఏమి మాట్లాడాలి.. ఏమి మాట్లాడకూడదు.. ఎప్పుడు మాట్లాడాలి అనే విషయాలను స్పీకర్ నిర్దేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది పూర్తిగా విరుద్ధం’’ అని అన్నారు. సభ నడుస్తున్న తీరుపై తమకు ఏమాత్రం విశ్వాసం లేదన్నారు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పారు.